తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే ఈసాారి తెెలంగాణ ప్రజల ముందు కాదు యావత్ దేశం ముందు కేసీఆర్ పై రెచ్చిపోయారు రేవంత్.
న్యూడిల్లీ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమనేలా వుంది. ఈ ఇద్దరు నేతల మధ్య రాజకీయ వైరం ఈనాటిది కాదు... చాలాకాలంగా నువ్వెంత అంటే నువ్వెంత అనేలా పొలిటికల్ ఫైట్ సాగుతోంది. కేసీఆర్ సర్కార్ ఓటుకు నోటు కేసులో రేవంత్ ను అరెస్ట్ చేయడంతో వీరి మధ్య రాజకీయ వైరం కాస్త వ్యక్తిగత స్థాయికి చేరుకుంది. తన ఒక్కగానొక్క కూతురు పెళ్లి సమయంలోనూ రేవంత్ జైల్లో వుండాల్సి వచ్చింది. ఇది రేవంత్ మనసును తీవ్రంగా గాయపర్చిందని... తనను ఇంత మనోవ్యధకు గురిచేసిన కేసీఆర్ పనిపట్టాలని ఆనాడే నిర్ణయించుకున్నాడని ఆయన ఆయన సన్నిహితులు చెబుతుంటారు.
అనుకున్నట్లుగానే బిఆర్ఎస్ ను ఓడించి కేసీఆర్ ను గద్దెదించారు రేవంత్ రెడ్డి. ఇంతటితో రేవంత్ గేమ్ ముగియలేదు... కేసీఆర్ ను దించిన ముఖ్యమంత్రి పీఠాన్ని తాను అధిరోహించాడు. తనను ఎలాగైతే అధికారాన్ని అడ్డం పెట్టుకుని ముప్పుతిప్పలు పెట్టారో అదే అనుభవాన్ని కేసీఆర్ కు రుచిచూపించాలని చూస్తున్నారు. ఇందులో భాగంగానే కాళేశ్వరంలో జరిగిన అవినీతి, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుని స్వయంగా రేవంత్ హ్యాండిల్ చేస్తున్నట్లు సమాచారం. ఎలాగైనా కేసీఆర్ తో పాటు ఆయన కుటుంబసభ్యులు కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావులతో ఊచలు లెక్కపెట్టించాలన్నది సీఎం రేవంత్ లక్ష్యమని... తాము కూడా అదే కోరుకుంటున్నామని కొందరు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అంటున్నారు.
undefined
తాజాగా ప్రముఖ జాతీయ మీడియా సంస్థలో ప్రసారమయ్యే ఆప్ కి అదాలత్ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వ్యాఖ్యాత రజత్ శర్మ తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ప్రశ్నలు సంధించగా రేవంత్ ఆసక్తికర సమాధానాలు చెప్పారు. ఈ కార్యక్రమం రేపు (శనివారం) ప్రసారం అవుతుండగా తాజాగా ఆసక్తికరమైన టీజర్ విడుదల చేసారు. ఇందులో రేవంత్ పంచ్ డైలాగ్స్ తెలంగాణ ప్రజలు మరీముఖ్యంగా కాంగ్రెస్ శ్రేణులకు ఆకట్టుకుంటున్నాయి.
గతంలో కేసీఆర్ జైలుకు పంపాడనే ఇప్పుడు ప్రతీకారం తీర్చుకుంటున్నారా? అని వ్యాఖ్యాత అడగ్గా... అసలు తాను ఇంకా ప్రతీకారం తీర్చుకోవడమే ప్రారంభించలేదని సీఎం రేవంత్ తెలిపారు. ఇప్పటివరకు జరిగింది కేవలం టీజర్ మాత్రమే... ఇంకా సినిమా మిగిలేవుంది అనేలా రేవంత్ కామెంట్స్ వున్నాయి. అంటే రానున్న రోజుల్లో కేసీఆర్, బిఆర్ఎస్ పార్టీలను దెబ్బతీసేందుకు సంచలన నిర్ణయాలు వుంటాయని రేవంత్ మాటలను బట్టి అర్థమవుతుంది. కేసీఆర్ పై ప్రతీకారం తీర్చుకోడానికి ఏం చేయనున్నారో పూర్తిగా ప్రసారమయ్యే ఆప్ కీ అదాలత్ లో రేవంత్ చెబుతారేమో చూడాలి.
ఇక ఈ కార్యక్రమంలో బాలయ్య బాబు స్టైల్లో మరో మాస్ డైలాగ్ కూడా పేల్చాడు సీఎం రేవంత్. అసెంబ్లీ ఎన్నికల ఫలితం ఎలావున్నా లోక్ సభ ఎన్నికల్లో బిఆర్ఎస్ సత్తా చాటుతుందని... ఇన్నిరోజులు మౌనంగా వున్న సింహం(కేసీఆర్) బయటకు వచ్చిందని బిఆర్ఎస్ నాయకులు అంటున్నారని వ్యాఖ్యాత రజత్ శర్మ గుర్తుచేసారు. వెంటనే సింహాన్ని ఎదిరించేందుకు తనవద్ద తుపాకీ రెడీగా వుంది... ఒక్క తూటాతో పని అయిపోతుందని రేవంత్ అన్నారు. తాను కూడా పిల్లులు, కుక్కలను కొట్టను... కొడితే పులే... రమ్మనండి చూసుకుందాం.. అంటూ తన స్టైల్లోనే ఘాటుగా సమాధానం ఇచ్చారు.
AAP KI ADALAT with Rajat Sharma ji tmrw at 10 PM on INDIA TV. pic.twitter.com/CD80MBeZFP
— Revanth Reddy (@revanth_anumula)
తెలంగాణ ముఖ్యంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి తొలిసారిగా జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. కోర్టు సెట్టింగ్, అతిథిని బోనులో కూర్చోబెట్టి విచారిస్తున్నట్లు సరికొత్త కాన్సెప్ట్ తో సాగే 'ఆప్ కీ అదాలత్' లో రేవంత్ పాల్గొన్నారు. రేపు (శనివారం) ప్రసారం కానున్న ఈ కార్యక్రమంలో కోసం అటు కాంగ్రెస్, ఇటు బిఆర్ఎస్ శ్రేణులే కాదు రాజకీయాలపై ఆసక్తి కలిగిన తెలంగాణ ప్రజలు కూడా ఎదురుచూస్తున్నారు. ఈ కార్యక్రమం తర్వాత బిఆర్ఎస్ శ్రేణులు రేవంత్ పై ఎదురుదాడికి దిగే అవకాశాలున్నాయి.
ఇటీవల హైదరాబాద్ లోక్ సభ బిజెపి అభ్యర్థి మాధవీలత కూడా ఆప్ కీ అదాలత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. హైదరాబాద్ పార్లమెంట్ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ సొంత నియోజకవర్గం... ముస్లింల ప్రాబల్యం కలిగిన పాతబస్తీలో ఎలా ఆయనను ఎలా ఎదుర్కొనేది... అక్కడ ఎలా అభివృద్ది చేసేది వివరించారు మాధవీలత. అంతేకాదు పాతబస్తీ ప్రజల జీవన పరిస్థితులు, మహిళల దుర్భర స్థితిని గురించి మాధవీలత దేశ ప్రజలకు వివరించారు. ఇలా ఆసక్తికరంగా సాగిన మాధవీలత ఇంటర్వ్యూను ప్రధాని నరేంద్ర మోదీ కూడా వీక్షించారంట... ఈ విషయాన్ని ఆయనే వెల్లడించారు. మాధవి లత చాలా బలంగా తన ఆలోచనల్ని వ్యక్తం చేశారంటూ ట్విట్టర్ వేదికన ప్రశంసించారు ప్రధాని. ప్రతి ఒక్కరూ ఈ ఎపిసోడ్ ని వీక్షించాలని మోదీ ట్వీట్ చేశారు. ప్రధాని ట్వీట్ తో దేశవ్యాప్తంగానే కాదు తెలుగు రాష్ట్రాల్లోనూ మాధవీలత, ఆప్ కీ అదాలత్ లో ఆమె మాటలు ఫేమర్ అయ్యాయి.