హైదరాబాద్ అభివృద్దిపై తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. నగర అభివృద్ది కోసం గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను కొనసాగిస్తామని స్పష్టం చేసారు.
హైదరాబాద్ : తెలంగాణ రాజధాని హైదరాబాద్ అభివృద్దిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ప్రపంచంతో పోటీ పడుతున్న నగరాన్ని మరింత అద్భుతంగా తీర్చిదిద్దే బృహత్తర ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ శివారులోని ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలోని 25వేల ఎకరాల్లో మరో నగరాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు. హెల్త్, స్పోర్ట్స్, కాలుష్య రహిత పరిశ్రమలతో ఈ సిటీని ఏర్పాటు చేయబోతున్నట్లు రేవంత్ రెడ్డి ప్రకటించారు.
హైదరాబాద్ నానక్ రామ్ గూడలో నూతనంగా నిర్మించిన తెలంగాణ స్టేట్ ఫైర్ సర్వీసెస్ హెడ్ క్వార్టర్స్ భవనాన్ని సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... గత ముప్పై ఏళ్లలో హైదరాబాద్ శరవేగంగా అభివృద్ది చెందిందన్నారు. రాష్ట్ర రాజకీయాలు ఎలా వున్నా... అధికారంలో ఎవరున్నా నగర అభివృద్ది కొనసాగిందని తెలిపారు.
హైదరాబాద్ నగరం పెట్టుబడులకు అనువైన ప్రాంతం... అందువల్లే అనేక జాతీయ, అంతర్జాతీయ పరిశ్రమలు ఇక్కడ వెలిసాయని సీఎం పేర్కొన్నారు. నగరంలో శాంతి భద్రతలు సరిగ్గా వుంటేనే పెట్టుబడులు వస్తాయి... ఆ విషయంలో తెలంగాణ పోలీసులను అభినందించాలని అన్నారు. హైదరాబాద్ నగర అభివృద్ధికి గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలను కొనసాగిస్తామని సీఎం స్పష్టం చేసారు. మరింత ఉన్నతంగా నగరాన్ని అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని రేవంత్ ప్రకటించారు.
Also Read మేడిగడ్డ వద్ద నిర్మాణం వద్దని నిపుణుల సూచన: అసెంబ్లీలో రేవంత్ రెడ్డి
హైదరాబాద్ లో రెండో దశ మెట్రో రద్దు అయినట్లుగా జరుగుతున్నదంతా తప్పు ప్రచారమని సీఎం తెలిపారు. ప్రజలకు ఉపయోగపడేలా మెట్రో విస్తరణ చేయబోతున్నామని స్పష్టం చేసారు. ఇక ఫార్మాసిటీల ఏర్పాటు కాదు ఫార్మా విలేజ్ లను ఏర్పాటుచేస్తామని సీఎం ప్రకటించారు. అపోహలు వద్దు.. కాంగ్రెస్ ప్రభుత్వానికి స్పష్టమైన విధానం ఉంది... దాని ప్రకారమే ముందుకు వెళతామని రేవంత్ రెడ్డి తెలిపారు.
తమకే అంతా తెలుసు.. తామే మేధావులం అనుకుంటే ఫలితం మేడిగడ్డ బ్యారేజీలా వుంటుందంటూ మాజీ సీఎం కేసీఆర్ కు రేవంత్ చురకలు అంటించారు. కాబట్టి స్వయం మేధావులలా వ్యవహరించకుండా అనుభవజ్ఞులు, నిపుణుల సలహాలతో ముందుకెళతామని అన్నారు. గత ప్రభుత్వం సృష్టించిన సమస్యలను పరిష్కరించుకుంటూనే భవిష్యత్ ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. ఆలోచించి నిర్ణయం తీసుకోడమే మా విధానం... నిర్ణయం తీసుకున్నాక ఇక ఆలోచించడం వుండకూడదని సీఎం రేవంత్ తెలిసారు.
తెలంగాణ అభివృద్ధికి మెగా మాస్టర్ ప్లాన్ తీసుకొస్తామని సీఎం తెలిపారు. 2050 మెగా మాస్టర్ ప్లాన్ కోసం కసరత్తు జరుగుతోందని... త్వరలోనే తీసుకువస్తామన్నారు.
అర్బన్, సెమీ అర్బన్, రూరల్... ఇలా మూడు భాగాలుగా విభజించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. తెలంగాణ ప్రజలకు సుపరిపాలన అందిస్తూనే అభివృద్ది దిశగా రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తామని సీఎం రేవంత్ వెల్లడించారు.