
Fire Accident in Koti: హైదరాబాద్ నగరంలోని కోటి మార్కెట్‌లో అగ్నిప్రమాదం జరిగింది. కోటిలోని గుజరాతీ గల్లీలోని జె ఎం డి ఎలక్ట్రానిక్స్ కి చెందిన సిసి కెమెరా గోడౌన్‌లో శనివారం సాయంత్రం అగ్నిప్రమాదం జరిగింది. ఈ కెమెరాల కు సంబందించిన స్టోరేజ్ గోదాం ను దుకాణానికి సమీపంలో ఉన్న రెసిడెన్షియల్ బిల్డింగ్ లోని మొదటి అంతస్తులోఈ ప్రమాదం జరిగింది. లక్షల విలువైన ఎలక్ట్రానిక్స్ దగ్ధమయ్యాయి. అయితే.. ఈ ఘటన సమయంలో అందులో ఎవరు లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ భవనంలోని మొదటి అంతస్తులో ఎలక్ట్రానిక్ వస్తువులు నిల్వ ఉంచి మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న గౌలిగూడ అగ్నిమాపక కేంద్రం అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఉండవచ్చని అగ్నిమాపక అధికారులు అనుమానిస్తున్నారు.ఈ ప్రమాదంలో 20 నుంచి 25 లక్షల రూపాయలు విలువ చేసే సిసి కెమెరాలు అగ్నికి ఆహుతయ్యాయని భావిస్తున్నారు.
నగరంలో మరో అగ్ని ప్రమాద ఘటన జరిగింది. చందానగర్‌లో ఓ సినిమా షూటింగ్ సెట్‌లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అగ్నిమాపక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సినిమా షూటింగ్ సెట్ వెనుక ఉన్న చెత్తకుప్పలో మంటలు చెలరేగి వేగంగా వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అగ్నిప్రమాదానికి గల కారణాలను ఆరా తీస్తున్నారు.