తెలంగాణ తల్లి విగ్రహం, అధికారిక చిహ్నం ఎలా వుండనున్నాయంటే..: సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు

By Arun Kumar P  |  First Published Feb 6, 2024, 8:13 AM IST

ఇటీవల జరిగిన తెలంగాణ కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలపై సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే కేబినెట్ నిర్ణయాలు వున్నాయని ఆయన అన్నారు.  


హైదరాబాద్ : ఇటీవల జరిగిన కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. తెలంగాణ తల్లి విగ్రహంతో పాటు రాష్ట్ర చిహ్నాన్ని మార్చాలన్న నిర్ణయించడానికి గల కారణాలను సీఎం వివరించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలా రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయాలు వున్నాయని సీఎం రేవంత్ తెలిపారు. 

''ఒక జాతి అస్థిత్వానికి చిరునామా ఆ జాతి భాష, సాంస్కృతిక వారసత్వమే. ఆ వారసత్వాన్ని సమున్నతంగా నిలబెట్టాలన్న సదుద్దేశంతోనే 'జయ జయహే తెలంగాణ…’ గీతాన్ని రాష్ట్ర అధికారిక గీతంగా… సగటు తెలంగాణ ఆడబిడ్డ రూపురేఖలే తెలంగాణ తల్లి విగ్రహానికి ప్రతిరూపంగా… రాచరికపోకడలు లేని చిహ్నమే రాష్ట్ర అధికారిక చిహ్నంగా… వాహన రిజిస్ట్రేషన్లలో TS బదులు ఉద్యమ సమయంలో ప్రజలు నినదించిన TG అక్షరాలు…ఉండాలన్నది నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష. ఆ ఆకాంక్షలను నెరవేరుస్తూ రాష్ట్ర కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నాం'' అంటూ ఎక్స్(ట్విట్టర్) వేదికన రేవంత్ రెడ్డి వివరించారు. 

Latest Videos

undefined

ఇదిలావుంటే తెలంగాణ కేబినెట్ భేటీలో మరికొన్ని  గ్యారంటీలు, హామీల అమలుకు కూడా నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా పేద, మధ్యతరగతి ప్రజలకు ఊరటనిచ్చేలా గృహావసరాలకు 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్,  కేవలం రూ.500 వంటగ్యాస్ సిలిండర్ అందించేందుకు రేవంత్ సర్కార్ సిద్దమయ్యింది. త్వరలోనే ఈ రెండింటి అమలుకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది.  

Also Read  ఇక రంగంలోకి కేసీఆర్ ... నేడు తెలంగాణ భవన్ లో కీలక భేటీ

ఇక తెలంగాణలో కులగణన చేపట్టాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ అభివృద్దికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కేబినెట్ నిర్ణయించింది. ఇందులో భాగంగా కొడంగల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. తెలంగాణ హైకోర్టుకు 100 ఎకరాల భూమి కేటాయింపుకు కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 

ఈ నెల 8 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు నిర్వహించేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉద్యోగాల భర్తీపై కూడా రేవంత్ మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. ఖైదీల క్షమాభిక్షకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను కేబినెట్ ఆదేశించింది. రాష్ట్రంలోని అన్ని ఐటీఐలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా అప్‌గ్రేడ్ చేయాలని నిర్ణయించింది. యువతకు ఉపాధి అవకాశాలు అందించేలా నైపుణ్య అభివృద్ధి కోర్సులు ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. నిజాం షుగర్ ఫ్యాక్టరీని ప్రారంభించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కేబినెట్‌లో చర్చించారు. 

click me!