డిసెంబర్ 9 నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం.. ఆధార్ చూపిస్తే చాలు , రేవంత్ సర్కార్ తొలి నిర్ణయం

By Siva Kodati  |  First Published Dec 7, 2023, 8:56 PM IST

కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన 6 గ్యారంటీలలో రెండు ప్రధానమైన గ్యారంటీలను అమలు చేయాలనుకుంటున్నామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పుట్టినరోజైన డిసెంబర్ 9న రెండు గ్యారెంటీలను అమల్లోకి తీసుకొస్తున్నట్లు ఆయన వెల్లడించారు.


కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన 6 గ్యారంటీలలో రెండు ప్రధానమైన గ్యారంటీలను అమలు చేయాలనుకుంటున్నామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పుట్టినరోజైన డిసెంబర్ 9న రెండు గ్యారెంటీలను అమల్లోకి తీసుకొస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన తెలంగాణ తొలి కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.

మంత్రివర్గ భేటీలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి మీడియాకు వివరించారు. మార్పు కోరుకునే వారికి రాబోయే ఐదేళ్లలో మార్పు చూపిస్తామని శ్రీధర్ బాబు తెలిపారు. 6 గ్యారంటీల అమలు ప్రక్రియలో భాగంగా అన్ని అంశాలను కేబినెట్‌లో సుదీర్ఘంగా చర్చించామని, రేపు 2 గ్యారంటీలకు సంబంధించి ఆయా శాఖల అధికారులతో సీఎం చర్చిస్తారని శ్రీధర్ బాబు చెప్పారు. 

Latest Videos

2014 నుంచి డిసెంబర్ 7, 2023 వరకు రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితిపై శ్వేతపత్రం రిలీజ్ చేస్తామని మంత్రి ప్రకటించారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితిపై అన్ని వివరాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించామని దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. రేపు విద్యుత్ శాఖ అధికారులతో సీఎం సమీక్ష చేస్తారని.. రైతులకు 24 గంటల కరెంట్‌తో పాటు గృహ వినియోగదారులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అమలుపై చర్చిస్తామని మంత్రి వెల్లడించారు.

ఈ నెల 9న తెలంగాణ అసెంబ్లీ సమావేశం నిర్వహిస్తున్నట్లు శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారంతో పాటు స్పీకర్ ఎన్నిక కూడా అదే రోజున వుంటుందని మంత్రి వెల్లడించారు. ఎల్లుండి నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తున్నామని, ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంపు గ్యారంటీని ఎల్లుండి నుంచి అమలు చేస్తామని శ్రీధర్ బాబు తెలిపారు. 

వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకుంటామని .. మంత్రులు, అధికారులు పంట నష్టంపై క్షేత్రస్థాయి పరిశీలన చేస్తారని శ్రీధర్ బాబు వెల్లడించారు. 4 గంటల కరెంట్ ఇవ్వడం మా గ్యారంటీ అని ఆయన స్పష్టం చేశారు. ఆధార్ కార్డ్ చూపించి మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయొచ్చునని మంత్రి తెలిపారు. కేబినెట్ సమావేశంలో గ్రూప్ 1, గ్రూప్ 2పై చర్చించామని  దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. 
 

click me!