Revanth Reddy: తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రితో పాటు పదకొండు మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. ఇంకా ఆరుగురికి రేవంత్ మంత్రివర్గంలో చోటు ఉంటుంది. అయితే ఆ ఆరుగురు ఎవరన్నది ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
Revanth Reddy: తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రితో పాటు పదకొండు మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. ఇంకా ఆరుగురికి రేవంత్ మంత్రివర్గంలో చోటు ఉంటుంది. అయితే ఆ ఆరుగుర్ని భర్తీ చేయడానికి వచ్చే నెల రెండో వారంలో కేబినెట్ విస్తరణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
ఈ విషయమై సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలు నేడు పార్టీ పెద్దలతో భేటీ కానున్నట్టు సమాచారం. ఖాళీగా ఉన్న ఆరు మంత్రి పదవుల కోసం ఆశావహులు సైతం తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. మరోవైపు.. ఈ నెల 28 నుంచి వచ్చేనెల 6 వరకు ప్రజా పాలన అనే ప్రోగ్రామ్ నిర్వహించాలని రేవంత్ సర్కార్ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం పూర్తయిన వెంటనే .. కొత్త ఏడాది జనవరి రెండో వారంలో కేబినెట్ విస్తరణ ఉండబోతుందని పార్టీ వర్గాలు కూడా విశ్వసిస్తున్నాయి.
తొలి విడతలో కేబినెట్ ఏర్పాటులో సీనియర్ నేతలకు మాత్రమే మంత్రి పదవులు దక్కాయి. కానీ, ఈ కేబినెట్ విస్తరణలో సీనియర్లతో పాటు కొత్త వారికి కూడా మంత్రి పదవులు వస్తాయనే పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఉన్న పోస్టులే ఆరు కానీ, పార్టీ అధికారంలోకి వస్తే తమకు మంత్రి పదవి గ్యారంటీ అని భావించిన ఆశవాహులు లిస్టు మాత్రం చాంతాండంత ఉంది. ప్రతి ఒక్కరూ తమకు మంత్రి పదవి వస్తుందని కొండంత ఆశ పెట్టుకున్నారు.
తొలి కేబినెట్ లో కొన్ని ప్రాంతాల నాయకులకే ప్రాధాన్యత ఇచ్చారు. ఈ సారి కేబినెట్ లో అవకాశం దక్కని ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నేతలకు అవకాశం దక్కుతుందనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. ఇందుకోసం ఏఐసీసీ వివిధ సమీకరణాల ఆధారంగా ఆహావాహుల జాబితాను పరిశీలిస్తున్నదట. ఏదిఏమైనా.. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వెంటనే మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని అధిష్టానం కూడా తీవ్రంగా కసరత్తు చేస్తుందట.
ఈ పేర్లు ప్రముఖంగా..
మంత్రి పదవుల కోసం ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వీరిలో ప్రముఖంగా అద్దంకి దయాకర్ పేరు ఖచ్చితంగా మలి విడత మంత్రి వర్గ విస్తరణలో ఉంటుందని ప్రచారం జోరుగా సాగుతోంది. అద్దంకి దయాకర్ తనకు సీటు రాకపోయినా పార్టీ కోసం పనిచేశారు. అతనికి మంత్రి పదవి ఇవ్వాలని సీఎం రేవంత్ సైతం పట్టుబట్టే అవకాశాలున్నాయి. అలాగే.. ఉమ్మడి నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి, ఆదిలాబాద్ నుంచి గడ్డం వినోద్, వివేక్, ప్రేమ్ సాగర్ రావులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
అలాగే.. లంబాడా కమ్యూనిటీ నుంచి ఎమ్మెల్యే బాలు నాయక్, మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ లు కూడా పదవుల రేసులో ఉన్నారు. వీరికి మంత్రి పదవులు కాకున్నా.. ఎమ్మెల్సీ పోస్టులు వరించే చాన్స్ ఉన్నదని చర్చ జరుగుతున్నది. ఇక మైనార్టీ కోటాలో మాజీ మంత్రి షబ్బీర్ అలీ, ఫిరోజ్ ఖాన్ లు పేర్లు వినిపిస్తున్నాయి. హైదరాబాద్ నుంచి అంజన్ కుమార్ యాదవ్ పేరు వినిపిస్తున్నది. జనవరి రెండో వారం వరకు మంత్రివర్గాన్ని పూర్తి స్థాయిలో విస్తరించి మొదటి బడ్జెట్ ను ప్రవేశ పెట్టేందుకు రేవంత్ కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం.