న్యూ వేరియంట్ జేఎన్.1 భయం నెలకొన్న వేళ తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 55 యాక్టివ్ కేసులు వున్నట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది.
హైదరాబాద్ : ప్రపంచ దేశాల్లో మరోసారి కరోనా మహమ్మారి అలజడి మొదలయ్యింది. కోవిడ్ 19 కొత్త వేరియంట్ జెఎన్.1 వేగంగా విస్తరిస్తూ మన దేశాన్ని కూడా చేరింది. ఇప్పటికే మన చుట్టుపక్కల కేరళ, మహారాష్ట్ర, కర్ణాటకలో జేఎన్.1 కేసులు బయటపడ్డా ఇప్పటివరకు తెలంగాణలో మాత్రం కేసులు బయటపడలేదు. కాబట్టి రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందవద్దని వైద్యారోగ్య శాఖ సంచాలకులు రవీంద్ర నాయక్ సూచించారు,
ఇక తెలంగాణలో సాధారణ కరోనా కేసులు మాత్రం మెళ్లిగా పెరుగుతున్నాయి. కేవలం రాజధాని హైదరాబాద్ కే పరిమితం అయిన కేసులు మెళ్లిగా జిల్లాలకు వ్యాపిస్తున్నాయి. గత 24 గంటల్లో (24 సాయంత్రం 5.30 నుండి 25 సాయంత్రం 5.30 గంటల వరకు) రాష్ట్రంలో కరోనా లక్షణాలతో బాధపడుతున్న 989 మందిని పరీక్షించగా 10 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో వెంటనే వీరిని ఐసోలేషన్ లో వుంచి చికిత్స అందిస్తున్నారు. తాజాగా బయటపడ్డ కేసులతో కలిపి తెలంగాణలో ప్రస్తుతం 55 కరోనా పాజిటివ్ కేసులు వున్నారు. వీరంతా వివిధ హాస్పిటల్లో, ఐసోలేషన్ లో వుండి చికిత్స పొందుతున్నారు.
తెలంగాణలో బయటపడుతున్న కరోనా కేసుల్లో అత్యధికం హైదరాబాద్ లోనే వున్నాయి. తాజాగా హైదరాబాద్ లో 9, కరీంనగర్ 1 పాజిటివ్ కేసు నమోదయ్యింది. ఇక ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, సంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లోనూ ఇటీవల కరోనా కేసులు వెలుగుచూసాయి. మొత్తంగా తెలంగాణలో కరోనా మహమ్మారి రాష్ట్రంలో మెళ్లిగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా వుండాలని వైద్యారోగ్య శాఖ అధికారులు సూచిస్తున్నారు.
ఇక ప్రస్తుత వాతావరణ పరిస్థితి కరోనా వ్యాప్తికి అనుకూలంగా వుటుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. గతంలో కూడా ఇలాగే శీతాకాలంలో కరోనా వ్యాప్తి అధికంగా వుంది. ఇప్పుడు కరోనా మరో కొత్తరూపం దాల్చి (జేఎల్.1) వేగంగా విస్తరిస్తోంది. కాబట్టి ప్రజలు కొంతకాలం అప్రమత్తంగా వుండాలని... అవసరం వుంటేనే ఇళ్లలోంచి బయటకు రావాలని సూచిస్తున్నారు. గతంలో మాదిరిగా మాస్కులు ధరించాలని, శానిటైజర్లు ఉపయోగించి కరోనా సోకకుండా ముందస్తుగానే జాగ్రత్తపడాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.