కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాలు విరిగిందని సానుభూతితో ఓట్లు పొందాలని చూస్తున్నారని.. అసలు కృష్ణా ప్రాజెక్ట్‌లను కేంద్రానికి అప్పగించిందే కేసీఆర్ అని సీఎం తెలిపారు.
గత ప్రభుత్వం తన తప్పులు కప్పిపుచ్చుకోవాలని చూసిందన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. మంగళవారం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులతో కలిసి ఆయన మేడిగడ్డ బ్యారేజ్‌లో పిల్లర్ కుంగిన ప్రదేశాన్ని ముఖ్యమంత్రి పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం మాట్లాడుతూ.. మేడిగడ్డ కుంగినప్పుడు తాము రావాలనుకుంటే అప్పటి ప్రభుత్వం రానివ్వలేదన్నారు.
కాలు విరిగిందని సభకు కేసీఆర్ రాలేదని.. నల్గొండ దగ్గర వుందా, అసెంబ్లీ దగ్గర వుందా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ అంత సత్యహరిశ్చంద్రుడైతే అసెంబ్లీకి ఎందుకు రాలేదని ఆయన నిలదీశారు. కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ సర్కారే కేఆర్ఎంబీ అప్పగించిందని అబద్ధాలు ప్రచారం చేశారని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగైదు పిల్లర్లు కూలితే తప్పా అని కేసీఆర్ అంటున్నారని.. ఎమ్మెల్యేల ప్రాజెక్ట్ సందర్శనను చులకన చేసి మాట్లాడటం మరింత దిగజారుడుతనమని రేవంత్ ఎద్దేవా చేశారు.
చావునోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చినా అని ఒక కోటి ఒకసారి కేసీఆర్ అబద్ధం చెప్పారని ఆయన మండిపడ్డారు. కేసీఆర్ దోపిడికీ మేడిగడ్డ బలైపోయిందని, అన్నారం , సుందిళ్ల సున్నమైపోయాయన్నారు. ప్రాజెక్ట్‌ల డిజైన్స్, నిర్మాణం, నిర్వహణలో లోపాలు వున్నాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. నల్గొండలో సభ పెట్టి కాంగ్రెస్‌పై ఎదురుదాడి చేయాలని కేసీఆర్ చూశారని సీఎం దుయ్యబట్టారు. ఈ ప్రాజెక్ట్‌పై ఎన్నో అనుమానాలు వున్నాయని, ఎమ్మెల్యేలతో కలిసి వెళ్దామని లేఖ రాశామని ఆయన తెలిపారు.
ఉత్తమ్ తీర్మానంలో లోపాలు వున్నాయని అంటున్నారని.. దానికి మీ అల్లుడు హరీశ్ రావు ఎందుకు మద్ధతు ఇచ్చారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. హరీశ్‌కు పార్టీలో విలువలేదని.. అందుకే కేసీఆర్ సభకు రావాలని తాము కోరామన్నారు. కాగ్ నివేదిక కూడా వేల కోట్ల దోపిడీ జరిగిందని చెప్పిందని.. అసెంబ్లీలో మీ అవినీతిపై చర్చ పెట్టామన్నారు. కుంగిపోయిన మేడిగడ్డపై ఇంతవరకూ కేసీఆర్ ఎందుకు మాట్లాడలేదని రేవంత్ నిలదీశారు.
తీర్మానంలో లోపాలు వుంటే.. మీరు సభకు వచ్చి ఎందుకు సవరించలేదన్నారు. ఇప్పుడు కూడా బెదిరించి బతకాలని చూస్తున్నారని ముఖ్యమంత్రి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ అబద్ధాలను నమ్మడానికి తెలంగాణ సమాజం సిద్ధంగా వుందనుకుంటున్నారా అని రేవంత్ రెడ్డి నిలదీశారు. కాళేశ్వరం అవినీతిలో మీకు సంబంధం లేకుంటే, ఎందుకు సభకు రావడం లేదని సీఎం ప్రశ్నించారు.
ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా మీ గౌరవాన్ని ఎక్కడా తగ్గించమని, రేపు సభకు హాజరుకావాలని రేవంత్ కోరారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో నీళ్లు నింపితే ఏ క్షణంలోనైనా కుప్పకూలిపోతుందని ఆయన పేర్కొన్నారు. ఇంత పెద్ద పగుళ్లు వస్తే.. చిన్న సమస్య అంటారా అంటూ రేవంత్ ఫైర్ అయ్యారు . సాగునీటి ప్రాజెక్ట్‌లపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రవేశపెట్టే శ్వేతపత్రంపై చర్చలో పాల్గొనాలని ఆయన కోరారు.
ఎల్ అండ్ టీ సంస్థను బ్లాక్‌లిస్టులో పెట్టాలా , వద్దా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ సభకు వస్తే.. ఎంతసేపు మాట్లాడినా సమయం ఇవ్వమని స్పీకర్‌కు విజ్ఞప్తి చేస్తున్నానని సీఎం తెలిపారు. బీజేపీ నేతలు సీబీఐ ఎంక్వైరీ అడుగుతున్నారని.. మూడు బ్యారేజ్‌ల్లో ఎక్కడా నీళ్లు లేవన్నారు . నీళ్లు నింపితే కానీ , భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు వస్తాయో తెలియదని రేవంత్ పేర్కొన్నారు. కాళేశ్వరంపై లక్ష కోట్లు ఖర్చు పెట్టినా లక్ష ఎకరాలకు కూడా నీరు అందలేదన్నారు.
లక్ష ఎకరాలకు నీరు అందకపోయినా. . కేసీఆర్ మాత్రం కోటి ఎకరాలకు నీరు ఇచ్చామని గొప్పలు చెప్పారని ఆయన దుయ్యబట్టారు. నిర్మాణంలో నాణ్యతా లోపం వుందని డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పినప్పటికీ సమస్యను నిర్లక్ష్యం చేశారని సీఎం ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు ఏటా విద్యుత్ బిల్లులే రూ.10,500 కోట్లు వస్తున్నాయని.. రుణాలు , ఇతర ఖర్చులు కలిపి ప్రతి ఏటా రూ.25 వేల కోట్లు అవసరమవుతాయని రేవంత్ రెడ్డి వివరించారు.
రీడిజైన్ పేరుతో కాళేశ్వరం చేపట్టి.. భారీగా అవినీతికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. తన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే కేసీఆర్ నల్గొండలో సభ పెట్టారని రేవంత్ ఆరోపించారు. రెండు సార్లు అధికారమిస్తే.. ప్రాజెక్ట్‌ల పేరుతో దోచుకున్నారని దుయ్యబట్టారు. సీఎం కుర్చీ చేజారగానే.. నీళ్లు, ఫ్లోరైడ్ బాధితులు గుర్తొచ్చారా అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ వద్దకు వచ్చేందుకు ఎందుకు భయపడుతున్నారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
కాలు విరిగిందని సానుభూతితో ఓట్లు పొందాలని చూస్తున్నారని.. అసలు కృష్ణా ప్రాజెక్ట్‌లను కేంద్రానికి అప్పగించిందే కేసీఆర్ అని సీఎం తెలిపారు. ఎంపీ ఎన్నికల్లో ఓట్లు పొందేందుకు కొత్త ఎత్తు వేశారని.. ప్రజల కోసం బయటకు వెళ్లే అలవాటు కేసీఆర్‌కు లేదని రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు.