బేగంపేట్ ఎయిర్‌పోర్టులో చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీ? బీజేపీకి తెలుసా?

By Mahesh K  |  First Published Mar 8, 2024, 3:22 PM IST

బేగంపేట్ విమానాశ్రయంలో రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు భేటీ అయినట్టు తెలిసింది. ఇద్దరూ ఢిల్లీ వెళ్లుతుండగా ఎయిర్‌‌పోర్టులో రెండు గంటలపాటు సమావేశమైనట్టు సమాచారం.
 


తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన గురువుగా చెప్పుకునే టీడీపీ చీఫ్, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని బేగంపేట్ ఎయిర్‌పోర్టులో రెండు గంటలపాటు సమావేశం అయినట్టు తెలిసింది. మధ్యాహ్నం 3.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు వీరు భేటీ అయ్యారని సమాచారం. అయితే.. ఫొటోలు తీయనివ్వలేదని కొన్ని కథనాలు వచ్చాయి. వీరి ఈ భేటీ రాజకీయాల్లో కొత్త చర్చను లేవదీశాయి.

ఈ చర్చ గురించి బయటికి పెద్దగా రాలేదు. కానీ, ఈ భేటీ జరిగినట్టు కొన్ని వర్గాలు ఓ మీడియాకు సమాచారం ఇచ్చినట్టు కథనం వచ్చింది. కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లే క్రమంలో బేగంపేట్ ఎయిర్‌పోర్టుకు వెళ్లారు. ఢిల్లీలో ఐసీసీ స్క్రీనింగ్ కమిటీ భేటీ.. లోక్ సభ అభ్యర్థుల ఖరారుపై చర్చించే ఈ భేటీ కోసం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు.

Latest Videos

undefined

రేవంత్ రెడ్డితోపాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఢిల్లీకి వెళ్లారు. అయితే.. ఇతర కేంద్రమంత్రులతో భేటీలు ఉండటంతో భట్టి విక్రమార్క్ మార్చి 7వ తేదీ ఉదయమే వెళ్లిపోయారు. కాగా, ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి వెంటే ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లారు.

Also Read: చంద్రబాబుకు జేడీ లక్ష్మీనారాయణ కండీషన్.. ‘పొత్తుకు ముందు ఆ పని చేయండి’

ఇక చంద్రబాబు కూడా అదే రోజు ఢిల్లీకి వెళ్లారు. ఎన్డీయేలోకి చేరే విషయమై బీజేపీ హైకమాండ్‌తో చర్చలు జరపడానికి బయల్దేరి వెళ్లారు. ఇటు రేవంత్ రెడ్డి, అటు చంద్రబాబు నాయుడులు ఒకే రోజు ఢిల్లీకి వెళ్లారు. ఇద్దరూ బేగంపేట్ ఎయిర్‌పోర్టులో కలిశారని సమాచారం.

ఒకప్పుడు టీడీపీలో చంద్రబాబు నాయకత్వంలో రేవంత్ రెడ్డి పనిచేశారు. చంద్రబాబు నాయుడు తనకు గురువు అని రేవంత్ రెడ్డి స్వయంగా అంగీకరించారు. మొన్నటి ఎన్నికల వరకు చంద్రబాబును ఆయన కాంగ్రెస్‌లో ఉన్నా సమర్థించిన సందర్భాలు ఉన్నాయి. అయితే.. రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌లో ఉండటంతో ఆయన ఇండియా కూటమి కోసం పని చేయాల్సి ఉన్నది. ఇదిలా ఉండగా.. ఇండియా కూటమికి ప్రత్యర్థి ఎన్డీయేలో చేరడానికి చంద్రబాబు నాయుడు పార్టీ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నాల కోసం ఢిల్లీకి వెళ్లుతూ వీరిద్దరూ కలవడం గమనార్హం.

ఈ విషయం తెలిసిన వారు.. ఇంతకీ ఈ భేటీ గురించి బీజేపీ పెద్దలకు తెలుసా? అనే అనుమానాలను వెల్లడిస్తున్నారు. బీజేపీ పెద్దలకు తెలిసే జరిగిందా? అనే చర్చలు కూడా జరుగుతున్నాయి. ఏమైనా.. ఈ ఇద్దరు రాజకీయ నాయకుల మధ్య భేటీ జరిగిందనే వార్తే ఆసక్తికరంగా మారింది.

click me!