ప్రగతిభవన్‌లో గణపతి హోమం.. పాల్గొన్న సీఎం కేసీఆర్‌, కేటీఆర్ దంపతులు

By Siva KodatiFirst Published Sep 18, 2021, 9:02 PM IST
Highlights

బేగంపేటలోని ప్రగతి భవన్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు – శోభ దంపతులు శనివారం గణపతి హోమం నిర్వహించారు. వినాయక నవరాత్రుల సందర్భంగా హోమం, ప్రత్యేక పూజ కార్యక్రమాలు చేపట్టారు.

బేగంపేటలోని ప్రగతి భవన్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు – శోభ దంపతులు శనివారం గణపతి హోమం నిర్వహించారు. వినాయక నవరాత్రుల సందర్భంగా హోమం, ప్రత్యేక పూజ కార్యక్రమాలు చేపట్టారు. కార్యక్రమంలో ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌-శైలిమ దంపతులు, రాజ్యసభ సభ్యుడు జీ సంతోష్‌కుమార్‌, సీఎం కేసీఆర్‌ మనుమడు హిమాన్షు, మనుమరాలు అలేఖ్య తదితరులు పాల్గొన్నారు.

కాగా, రేపటి గణేశ్ నిమజ్జనానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. మొత్తం నిమజ్జనం ఆదివారమే పూర్తయ్యేలా ప్రణాళిక అమలు చేయనున్నారు అధికారులు. హుస్సేన్  సాగర్ చుట్టూరా నిమజ్జనానికి ఏర్పాట్లు చేశారు. అప్పర్ ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్, అలాగే నెక్లెస్ రోడ్, బుద్ధ భవన్ వద్ద నిమజ్జనానికి ఏర్పాట్లు చేశారు. హుస్సేన్ సాగర్ చుట్టూ 28 భారీ క్రేన్లను అందుబాటులో వుంచారు. అలాగే అడుగుకు మించి వున్న విగ్రహాలను అప్పర్ ట్యాంక్ బండ్ వద్దకు అనుమతించనున్నారు. పది అడుగుల కంటే తక్కువ వున్న విగ్రహాలన్నింటిని ఎన్టీఆర్ మార్గ్ అలాగే నెక్లెస్ రోడ్ వైపు మళ్లించనున్నారు. 

320 కిలోమీటర్ల పరిధిలో గణేశ్ శోభాయాత్ర నిర్వహించనున్నారు. ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనానికి ఎన్టీఆర్ మార్గ్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రతి మూడు నిమిషాలకో మెట్రో రైలును నడుపుతున్నారు అధికారులు. తెలంగాణలో ఖైరతాబాద్ గణేశ్ శోభాయాత్రకు ప్రత్యేక స్థానముంది. భారీ విగ్రహ ఏర్పాటు, శోభాయాత్ర, నిమజ్జనం అంతా సర్వత్రా ఆసక్తి కలిగిస్తాయి. ఈ ఏడాది 40 ఫీట్ల విగ్రహాలను రూపొందించగా.. నిమజ్జన ఏర్పాట్లు ఏ విధంగా వుంటాయన్నది ఉత్కంఠగా మారింది. కోవిడ్ నేపథ్యంలో ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనం శోభాయాత్రకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు అధికారులు.
 

click me!