పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు వెట్ రన్ ను ఈ నెల 16న ప్రారంభించనున్నారు సీఎం కేసీఆర్.
హైదరాబాద్: ఈ నెల 16న పాలమూరు- రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు వెట్ రన్ ను తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు.ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని నార్లాపూర్ ఇన్ టేక్ వద్ద స్విచ్ ఆన్ చేసి వెట్ రన్ ను కేసీఆర్ ప్రారంభిస్తారు. పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై సీఎం కేసీఆర్ ఇవాళ తెలంగాణ సచివాలయంలో సమీక్ష నిర్వహించారు.
రెండు కిలో మీటర్ల దూరంలోని నార్లపూర్ రిజర్వాయర్ లోకి నీటిని భారీ మోటార్లతో పంపింగ్ చేస్తారు. ఈ సందర్భంగా కృష్ణానదికి సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అదే రోజున భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. పాలమూరు- రంగారెడ్డి జిల్లాల నుండి జనాన్ని ఈ సభకు జనాన్ని సమీకరించనున్నారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు నుండి కృష్ణా జలాలను కలశాలతో ప్రతి గ్రామానికి తీసుకుపోతారు. ఈనెల 17 న ఉమ్మడి మహబూబ్ నగర్ రంగారెడ్డి జిల్లాలోని ప్రతీ గ్రామంలో దేవుళ్ళ పాదాలకు అభిషేకం చేయనున్నారు ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, ప్రజలు.
పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అడ్డంకులు తొలిగినందుకు గ్రామాల్లో దేవాలయాల్లో దేవుళ్ల పాదాలను పాలమూరు జలాలతో అభిషేకం చేసి మొక్కు తీర్చుకోవాలని కేసీఆర్ కోరారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నీళ్లు రావడం దక్షిణ తెలంగాణ కు పండుగ రోజుగా ఆయన పేర్కొన్నారు.
దైవకృప, ఇంజనీర్ల కృషి తో, పాలమూరు ఎత్తిపోతల పథకం అడ్డంకులు అధిగమించిందని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు.కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసిన స్ఫూర్తితోనే పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేయాలని ఆయన అధికారులను కోరారు.
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలను కొలిక్కి తేవడానికి జరిగిన కృషి లో కీలక పాత్ర పోషించిన సీఎంఓ, ఇరిగేషన్ ఉన్నతాధికారులను సీఎం కేసీఆర్ అభినందించారు.పర్యావరణ అనుమతులతో పాటు అనేక అడ్డంకులను అధిగమించిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో దక్షిణ తెలంగాణలోని పల్లె పల్లెకు తాగునీరు, సాగునీరు అందించనుందని సీఎం కేసీఆర్ చెప్పారు.ప్రాజెక్టుల నిర్మాణంతో బంగారు తెలంగాణ లక్ష్యం సంపూర్ణం కానుందని కేసీఆర్ తెలిపారు