అగ్రిగోల్డ్ స్కాంపై ఈడీ అదికారులు హైద్రాబాద్ నాంపల్లిలోని ఎంఎస్‌జే కోర్టులో ఇవాళ చార్జీషీట్ దాఖలు చేశారు.
హైదరాబాద్: అగ్రిగోల్డ్ స్కాంపై ఈడీ అధికారులు హైద్రాబాద్ నాంపల్లిలోని ఎంఎస్‌జే కోర్టులో చార్జీషీట్ దాఖలు చేశారు.అగ్రిగోల్డ్ ప్రమోటర్లు ఏవీ రామారావు, శేషు నారాయణరావు, హేమసుందరరావుపై చార్జీషీట్ లో ఈడీ అభియోగాలు మోపింది.
చార్జీషీట్ లో అగ్రిగోల్డ్ ఫామ్ ఏస్టేట్స్ సహా 11 అనుబంధ కంపెనీలపై ఈడీ ఆరోపణలు చేసింది. ఈడీ చార్జీషీట్ ను విచారణకు స్వీకరించింది నాంపల్లి ఎంఎస్‌జే కోర్టు. ఈ ఏడాది అక్టోబర్ 3న విచారణకు హాజరు కావాలని అగ్రిగోల్డ్ ప్రమోటర్లు, కంపెనీలకు కోర్టు సమన్లు జారీ చేసింది.
undefined
32 లక్షల మంది డిపాజిటర్లను మోసం చేసినట్టుగా అగ్రిగోల్డ్ పై ఆరోపణలున్నాయి. రూ. 6,380 కోట్ల మోసం చేశారని అగ్రిగోల్డ్ పై అభియోగాలను మోపింది ఈడీ. అగ్రిగోల్డ్ కేసులో రూ. 4,141 కోట్ల ఆస్తులు అటాచ్ చేసింది ఈడీ. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాదిలోని పలు రాష్ట్రాల్లో డిపాజిటర్ల నుండి అగ్రిగోల్డ్ సంస్థ డిపాజిట్లు సేకరించింది. అయితే డిపాజిటర్ల నుండి సేకరించిన డబ్బును మెచ్యూరిటీ తీరిన తర్వాత చెల్లించలేదు.
దీంతో అగ్రిగోల్డ్ సంస్థపై డిపాజిట్ దారులు కేసులు పెట్టారు. కొందరు సుప్రీంకోర్టును కూడ ఆశ్రయించారు. ఏపీ ప్రభుత్వం అగ్రిగోల్డ్ కేసును సీఐడీ విచారణకు అప్పగించింది. ఏపీలో విడతల వారీగా డిపాజిట్ దారులకు చెల్లింపులు చేపట్టారు.తెలంగాణకు చెందిన అగ్రిగోల్డ్ డిపాజిట్ దారులు గత ఏడాది సెప్టెంబర్ మాసంలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.అగ్రిగోల్డ్ ఆస్తులను వేలం వేసి కొంత సొమ్మును డిపాజిట్ దారులకు చెల్లించారు. తర్వాత ఈ కేసును ఏలూరు కోర్టుకు బదిలీ చేసింది. ఈ విషయమై సుప్రీంకోర్టులో తెలంగాణ హైకోర్టు తీర్పును సవాల్ చేశారు డిపాజిట్ దారులు. అయితే తెలంగాణ హైకోర్టు తీర్పుపై జోక్యం చేసుకొనేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఏలూరు కోర్టును ఆశ్రయించాలని డిపాజిట్ దారులకు సూచించిన విషయం తెలిసిందే.