హుజురాబాద్ ఉపఎన్నికే టార్గెట్ గా సీఎం మాస్టర్ ప్లాన్... మంత్రి గంగుల కీలక ప్రకటన

By Arun Kumar PFirst Published Jul 19, 2021, 12:33 PM IST
Highlights

హుజురాబాద్ ఉపఎన్నిక నేపధ్యంలో టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ మాస్టర్ ప్లాన్ వేశారు. దళిత బంధు పథకాన్ని హుజురాబాద్ నియోజకవర్గం నుండే ప్రారంభించాలని ఆయన నిర్ణయించినట్లు మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. 

కరీంనగర్: బాబాసాహెబ్ అంబేద్కర్ కన్న కలలను తెలంగాణ ప్రభుత్వం నిజం చేయబోతోందని రాష్ట్ర బిసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సీఎం కేసీఆర్ సూచనలతో రాష్ట్రంలోని దళిత ప్రజల జీవనంలో సమూలమైన మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు మంత్రి గంగుల. 

ఎవరి ప్రమేయం లేకుండా నేరుగా దళితుల అకౌంట్లలోకి నిధుల్ని విడుదల చేసే ''దళిత బందు'' పథకాన్ని కరీంనగర్ లో ప్రారంభించాలని సీఎం నిర్ణయించడం ఆనందదాయకమన్నారు. ఇందుకు సీఎంకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు గంగుల.

''సీఎం కేసీఆర్ కి  కరీంనగర్ జిల్లా అంటే ప్రత్యేక అభిమానం. నాడు ఉద్యమం మొదలు నేటి వరకూ కరీంనగర్ కేంద్రంగా అనేక కార్యక్రమాలు ప్రారంభించారు. నాడు దేశానికి మార్గదర్శనం చేసి ఆదర్శంగా నిలిచిన రైతుబందు లాంటి పథకం హుజురాబాద్ కేంద్రంగానే ప్రారంభించారు, నేడు దళితుల జీవితాల్లో వెలుగులు విరబూయించే దళిత బందు సైతం అదేవిదంగా సక్సెస్ కావాలనే ఉద్దేశంతోనే హుజురాబాద్ లో ప్రారంభించబోతున్నారు. ఇంత మంచి పథకాన్ని తీసుకొచ్చిన సీఎంకి దళితుల పక్షాన, కరీంనగర్ ప్రజానీకం పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా'' అన్నారు మంత్రి గంగుల కమలాకర్. 

read more  దళిత సాధికారత పథకానికి ‘‘తెలంగాణ దళిత బంధు’’గా పేరు పెట్టిన కేసీఆర్.. హుజురాబాద్ నుంచే శ్రీకారం

సోమవారం కరీంనగర్ పట్టణంలోని కోర్టు చౌరస్తాలో గల ర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు మంత్రి గంగుల కమలాకర్. అనంతరం సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలతో అభిషేకం చేశారు.

''స్వాతంత్ర్యం సిద్దించిన డెబ్బై ఏళ్లలో దళితుల స్థితిగతుల్లో సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన మార్పు ఏ నేత తీసుకురాలేదు. దళితుల సామాజిక, ఆర్థిక, జీవనాన్ని మరింతగా పెంచేందుకు, ఉన్న స్థితినుండి ఉన్నత స్థితికి తీసుకొచ్చేందుకు దళిత బందు ఉపయోగపడుతుంది. అన్ని రాజకీయ పక్షాలు ఇప్పటివరకూ దళితుల ఓట్లతో అధికారాన్ని అనుభవించారు కానీ ఏ ఒక్కరూ  కేసీఆర్ మాదిరిగా వారి జీవితాల్ని మార్చేందుకు పూనుకోలేదు'' అంటూ కేసీఆర్ ను పొగిడారు. 

''ఒక్కొక్క ప్రాథమ్యాన్ని పూర్తి చేసుకుంటూ దళిత బందు పథకాన్ని దిగ్విజయంగా ప్రారంభించుకోబోతున్నాం. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ అభినందించదగ్గ కార్యక్రమం దళిత బంధు'' అని గంగుల పేర్కొన్నారు.  

click me!