పార్లమెంటుకు రానీయడం లేదు: స్పీకర్ ఓం బిర్లాకు రేవంత్ రెడ్డి లేఖ

By telugu teamFirst Published Jul 19, 2021, 11:26 AM IST
Highlights

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి లోకసభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. తనను పోలీసులు హౌస్ అరెస్టు చేసిన నేపథ్యంలో తనను పార్లమెంటుకు రానీయడం లేదని ఆయన స్పీకర్ కు ఫిర్యాదు చేశారు.

హైదరాబాద్: పార్లమెంటుకు రాకుండా తనను తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు, మల్కాజిగిరి లోకసభ సభ్యుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు ఆయన సోమవారం లోకసభ స్పీకర్ ఓంబిర్లాకు ఓ లేఖ రాశారు. కోకాపేట భూముల విక్రయం ఆరోపణల నేపథ్యంలో ఆయనను పోలీసులు హౌస్ అరెస్టు చేయడంతో ఆయన ఆ లేఖ రాశారు.

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. రేవంత్ రెడ్డిని పార్లమెంటు సమావేశాలకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కోకాపేట ప్రభుత్వ భూముల అమ్మకాల్లో వేయి కోట్ల రూపాయలు అవినీతి ఆరోపణలు జరిగినట్లు రేవంత్ రెడ్డి ఆరోపించిన విషయం తెలిసిందే. 

ఈ రోజు పార్లమెంటులో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఆధారాలతో సహా కోకాపేట భూముల విక్రయాల్లో జరిగిన అక్రమాలతో ఫిర్యాదు చేస్తానని రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ నేపథ్యంలో పార్లమెంటుకు వెళ్లకుండా పోలీసులు రేవంత్ రెడ్డిని అడ్డుకున్నారు.

రేవంత్ రెడ్డిని హౌస్ అరెస్టు చేయడం నియంతృత్వానికి పరాకాష్ట్ అని తెలంగాణ పీసీసీ నేత మల్లు రవి దుయ్యబట్టారు. పార్లమెంటులో కోకాపేట అవినీతిని ఎండగడుతారనే భయంతోనే రేవంత్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారని ఆయన ఆరోపించారు. ఇది అప్రజాస్వామికమని ఆయన అన్నారు. ఇంత దుర్మార్గం ఎక్కడా చూడలేదని మల్లు రవి అన్నారు.  ఈ నియంతృత్వ, అవినీతి పాలకులకు ప్రజలే బుద్ధి చెబుతారని ఆయన అన్నారు. 

click me!