
తెలంగాణ ప్రజా ప్రతినిధులతో సీఎం కేసీఆర్ (kcr) రేపు సమావేశం కానున్నారు. హైదరాబాద్ హెచ్ఐసీసీలో స్వతంత్ర భారత వజ్రోత్సవాలను (75th independence day celebrations ) ప్రారంభించనున్నారు. రేపటి నుంచి ఈ నెల 22 వరకు వజ్రోత్సవాలు జరగనున్నాయి. రేపు ఉదయం 11.30 గంటలకు సీఎం కేసీఆర్ జాతీయ పతకావిష్కరణ గావిస్తారు. 75 మంది వీణ కళాకారులతో దేశ భక్తి గీతాల వాయిద్య ప్రదర్శన జరగనుంది.
ఇకపోతే.. స్వాతంత్ర్య వజ్రోత్సవాల సందర్భంగా పలు కానుకలను ప్రకటించారు ముఖ్యమంత్రి. కొత్తగా 10 లక్షల మందికి పింఛన్లు ఇవ్వబోతున్నామని కేసీఆర్ తెలిపారు. ప్రస్తుతం 36 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నామని తెలిపారు. స్వాతంత్ర్య వజ్రోత్సవాల సందర్భంగా కొత్త పింఛన్లు మంజూరు చేస్తున్నామని చెప్పారు. మొత్తం పింఛన్‌దారుల సంఖ్య 46 లక్షలకు చేరుతుందని సీఎం వెల్లడించారు. 57 ఏళ్ల వయసు వాళ్లకు పింఛన్లు మంజూరు చేస్తున్నామన్నారు. కొత్తగా డయాలసిస్ పేషెంట్లకు పింఛను ఇస్తామని .. వారికి నెలకు రూ. 2,016 ఇస్తామని కేసీఆర్ పేర్కొన్నారు.
స్వాతంత్ర్య వజ్రోత్సవ వేళ సత్ప్రవర్తన గల 75 మంది ఖైదీలను విడుదల చేస్తామని సీఎం ప్రకటించారు. అనాథ శరణాలయాల పిల్లలను స్టేట్ చిల్డ్రన్‌గా ప్రకటించారు. నేతన్నలకు బీమా కల్పిస్తామని... పాల మీద జీఎస్టీ ఎత్తివేయాలని ప్రధాని మోదీకి కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. 28 శాతం జీఎస్టీ వల్ల బీడీ కార్మికులు ఉపాధి కోల్పోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చేనేతపై కూడా జీఎస్టీని ఎత్తివేయాలని ప్రధానిని కోరుతున్నట్టుగా చెప్పారు. గాలి మీద తప్ప.. అన్నింటిపై పన్ను వేస్తున్నారని కేసీఆర్ ఫైరయ్యారు.