సోమవారంనాడు తెలంగాణ సీఎం కేసీఆర్ వరంగల్ పర్యటన చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కేసీఆర్ సీనియర్ నేత కడియం శ్రీహరి ఇంట్లో మధ్యాహ్న భోజనం చేశారు. కేసీఆర్ కోసం కడియం రకరకాల వంటలు చేయించారు.
వరంగల్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు సోమవారం వరంగల్ లో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాజీ మంత్రి, టీఆర్ఎస్ నేత కడియం శ్రీహరి నివాసంలో మధ్యాహ్న భోజనం చేశారు. కేసీఆర్ మధ్యాహ్న భోజనానికి కడియం శ్రీహరి రకరకాల కూరలు వండించారు.
కడియం శ్రీహరి మటన్, తలకాయ కూర, చికెన్, చేపలు, రొయ్యల ఫ్రై, నాటుకోడి పులుసు, చికెన్ దమ్ బిర్యానీ చేయించారు. శాకాహారంలో పెసరపప్పు టమాటా, బీరకాయ కూర, బెండకాయ ఫ్రై, టమాటా -పుదీనా పచ్చడి, ఉల్లిపాయ పచ్చడి, రైతా, పెరుగు, ఫ్రూట్ సలాడ్ కేసీఆర్ కోసం సిద్ధం చేశారు.
మంత్రులు ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి కేసీఆర్ సోమవారం మధ్యాహ్నం భోజనానికి హాజరయ్యారు. కేసీఆర్ పలు రకాల వంటలు రుచి చూసి చివరగా దానిమ్మ రసం తాగారు. అన్ని వంటలూ బాగున్నాయని, ఎప్పుడు వరంగల్ వచ్చినా భోజనానికి శ్రీహరి ఇంటికే రావాలని ఉందని కేసీఆర్ అన్నారు.
ఈ సందర్భంగా కడియం శ్రీహరి మనవరాలి జన్మదిన వేడుకలు నిర్వహించారు. పాపను కేసీఆర్ ఆశీర్వదించారు. సోమవారం కేసీఆర్ వరంగల్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.