
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా గన్‌పార్కులో అమరవీరుల స్తూపం వద్ద సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో నిర్వహిస్తున్న తెలంగాణ అవతరణ వేడుకల్లో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పతాకం ఆవిష్కరించారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటైన 8 ఏళ్లలో సాధించిన ప్రగతిని వివరించారు. 75 ఏళ్లలో ఏ రాష్ట్రం సాధించని విజయాలను.. 8 ఏళ్లలో తెలంగాణ ప్రభుత్వం సాధించిందని తెలిపారు. తెలంగాణ ఆవిర్భావంకు ముందు.. ఇప్పుడున్న పరిస్థితులకు అసలు పోలికే లేదన్నారు.
అనేక రంగాల్లో తెలంగాణ.. దేశానికే ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. 8 ఏళ్ల స్వల్ప వ్యవధిలో దేశానికే దిశ నిర్దేశం చేసే కరదీపికగా నిలిచిందని తెలిపారు. రాష్ట్ర తలసరి ఆదాయం 2.78 లక్షలకు చేరుకుందన్నారు. జాతీయ తలసరి ఆదాయం కంటే.. తెలంగాణ తలసరి ఆదాయం ముందుందని తెలిపారు. తలసరి ఆదాయంలో పెరుగుదలలో ఆదర్శంగా నిలిచామని చెప్పారు. కరెంట్ కష్టాలకు చరమగీతం పాడి చరిత్రకెక్కామని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వ చేపట్టే ప్రతి చర్యలో మానవీయ కోణమే దర్శనమిస్తుందన్నారు.
ఇంకా కేసీఆర్ మాట్లాడుతూ.. ‘‘ఎన్నో అవరోధాలు ఎదురైన అభివృద్దిలో దూసుకుపోతున్నాం. కరోనా సృష్టించిన సంక్షోభం నుంచి తెలంగాణ త్వరగా కోలుకుంది. కఠిన, పటిష్టమైన ఆర్థిక క్రమశిక్షణతో ఆదాయ వనరులను పెంచుకున్నాం. 2014-2019 వరకు 17.24శాతం సగటు ఆర్థిక వృద్ధిరేటుతో తెలంగాణ దేశంలో అగ్రస్థానంలో నిలిచింది. దేశంలో 24 గంటలు విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే. తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్నాం. రాష్ట్ర తలసరి విద్యుత్ వినియోగం 73 శాతం అధికం. విద్యుత్ రంగంలో స్వయం సమృద్ది సాధించాం. ప్రస్తుతం మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాం.
మిషన్ భగీరథ పథకం అనేక రాష్ట్రాలకు ఆదర్శంగా మారింది. మిషన్ భగీరథతో తాగునీటి సమస్యకు పరిష్కారించాం. ఇంటింటికి మంచినీరు సరఫరా చేస్తున్నాం. రాష్ట్రంలో బిందెల కొట్లాట, తాగునీటి యుద్దాలు లేవు. సమైక్య రాష్ట్రంలో వ్యవసాయ రంగం కుదేలైంది. సమైక్య రాష్ట్రంలో అప్పులతో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలు తెచ్చాం. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం దేశ చరిత్రలోనే ఓ అపూర్వ ఘట్టం. కేవలం మూడేళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తిచేసి ప్రపంచాన్ని నివ్వెరపరిచాం. సకాలంలో రైతులకు ఎరువులు అందిస్తున్నాం. కల్తీ విత్తనాల నియంత్రణకు కఠిన చర్యలు చేపట్టాం.
దళిత బంధు ఒక గొప్ప సామాజిక ఉద్యమం. దళితుల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపట్టాం. దళితబంధు ద్వారా అనేకమంది ఉపాధి పొందుతున్నారు. దళితబంధు కోసం బడ్జెట్‌లో రూ.17,700 కోట్లు కేటాయించాం. గూడు లేని నిరుపేదల సొంతింటి కల సాకారం చేస్తున్నాం. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పూర్తి ఉచితంగా నిర్మిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం అనేది నిరంతర ప్రక్రియ. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడులను బలోపేతం చేసేందుకు మన ఊరు- మన బడి చేపట్టాం.
ప్రజా వైద్యం, ఆరోగ్య రంగాల్లో రోజురోజుకు గుణాత్మక పురోగతిని సాధిస్తున్నాం. ప్రభుత్వ ఆస్పత్రులలో మౌలిక సదుపాయాలు మెరుగు పరచడం జరిగింది. 56 వేల ఆక్సిజన్ బెడ్స్ నేడు రాష్ట్రంలో అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ ఆస్పత్రులలో పడకలు సంఖ్య పెంచడానికి, మెరుగైన వైద్యం అందించడానికి.. ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులను పెంచింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మోకీలు మార్పిడి శస్త్రచికిత్సలు కూడా చేస్తున్నాం. రాష్ట్రంలో మహిళా, అటవీ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తున్నాం. కేసీఆర్ కిట్ ద్వారా 13 లక్షల మందిపైగా లబ్ది చేకూరింది.
బస్తీ దవాఖానాలు ద్వారా పట్టణాలు, నగరాల్లో మెరుగైన వైద్యసేవలు అందజేయడం జరుగుతుంది. హైదరాబాద్ నలుమూలలా 4 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మాణం చేపట్టాం. ఒక్కో ఆస్పత్రిలో వెయ్యి పడకలు ఉంటాయి. నిమ్స్ ఆస్పత్రిలో మరో 2 వల పడకలు పెంచుతున్నాం. వరంగల్‌లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మిస్తున్నాం. దేశంలో అత్యుత్తమ వైద్యసేవలు అందించే తొలి మూడు రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. వైద్య రంగంలో తెలంగాణ పనితీరును కేంద్రం అనేక సార్లు ప్రశంసించింది.
అవకాశమున్న ప్రతిచోట చేపల పెంపకం చేపట్టాం. మత్స్యకారుల జీవితాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. చెరువులు, జలాశయాల్లో చేపపిల్లలు వేస్తున్నాం. మత్స్యకకారులకు ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తున్నాం. నేత కార్మికులకు బతుకమ్మ చీరల తయారీ బాధ్యతలు అప్పగించడం జరిగింది. తెలంగాణలో కొత్తగా 192 మైనార్టీ గురుకులాలు ఏర్పాటు చేశాం. తెలంగాణ ప్రభుత్వ చేపట్టిన సంస్కరణలు మంచి ఫలితాలను ఇస్తున్నాయి. అన్ని గూడాలు, తండాలను గ్రామ పంచాయితీలుగా మార్చాం. యాదాద్రి క్షేత్రాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దాం. జలాశయాల వద్ద టూరిస్టు స్పాట్‌లు అభివృద్ది చేస్తున్నాం.
తెలంగాణ రాష్ట్రం వచ్చాక 1.35 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశాం. ప్రస్తుతం మరో 90 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నాం. స్థానిక అభ్యర్థులకు 95 శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్నాం. భూ రికార్డుల్లో పారదర్శకత కోసం ధరణి పోర్టల్ తెచ్చాం. కొత్త జిల్లాలు, మున్సిపాలిటీలు, మండలాలు ఏర్పాటు చేసుకున్నాం. అన్ని తండాలు, గూడాలను పంచాయతీలుగా మార్చాం. 7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో సచివాలయం నిర్మిస్తున్నాం. అంతర్జాతీయ పెట్టుబడుల ఆకర్షణలో రాష్ట్రం అగ్రగామిగా ఉంది. నేడు హైదరాబాద్‌లో 1,500 ఐటీ కంపెనీలు ఉన్నాయి. ఐటీ, పారిశ్రామిక రంగాల్లో 24 లక్షల ఉద్యోగాల కల్పన జరిగింది. దేశంలో అత్యధిక వేతనం పొందుతున్నది తెలంగాణ ఉద్యోగులే. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి ద్వారా వాటి రూపురేఖలను మారుస్తున్నాం. క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేస్తున్నాం. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ద్వారా 11.44 లక్షల మందికి లబ్ది కలిగింది. మద్యం దుకాణాల్లో గౌడ సోదరులకు 15 శాతం రిజర్వేషన్లు కల్పించాం’’ అని చెప్పారు.
కేంద్రంపై కేసీఆర్ ఫైర్..
విద్వేష రాజకీయాల్లో చిక్కి దేశం విలవిల్లాడుతోందని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి జాబితా పేరుతో కేంద్రం పెత్తనం పెరుగుతోందని మండిపడ్డారు. ‘‘సమైక్య పాలకులు అప్పుడు వివక్ష చూపితే.. ఇప్పుడు స్వరాష్ట్రంలో కేంద్రం వివక్ష చూపుతోంది. ప్రగతిశీల రాష్ట్రాలకు ప్రత్యేక ప్రోత్సహం అందించకుండా.. నిరుత్సాహం కలిగించేలా కేంద్రం వ్యవహరిస్తోంది. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచే వివక్ష ప్రారంభమైంది. కేంద్ర వైఖరి బాధకరంగా ఉంది. కొత్త రాష్ట్రానికి అదనపు నిధులు కోరినా నయాపైసా ఇవ్వలేదు. కేంద్రం అనేక విషయాల్లో రాష్ట్రంపై వివక్ష చూపిస్తోంది. విభజన చట్టం హామీలన్నీ బుట్టదాఖలు చేసింది. కేంద్రం తీరును తెలంగాణ ప్రభుత్వం ఖండిస్తోంది’’ అని కేసీఆర్ తెలిపారు.
‘‘దేశంలో మత పిచ్చి తప్ప మరే చర్చలేదు. విచ్చిన్నకర శక్తులు ఇలాగే పెట్రేగి పోతే.. సమాజ ఐక్యతకు ప్రమాదం ఏర్పడుతుంది. అశాంతి ఇలాగే ఉంటే అంతర్జాతీయ పెట్టుబడులు రావు. ఉన్న పెట్టుబుడులు వెనక్కి వెళ్లే పరిస్థితి వస్తుంది. దేశం కోలుకోవడానికి మరో వందేళ్లు పట్టినా ఆశ్చర్యం లేదు. భారతదేశంలో ప్రజలకు కావాల్సింది.. కరెంట్, మంచినీళ్లు, ప్రాజెక్టులు, ఉద్యోగాలు, ఉపాది. భారతదేశం ప్రగతి పథంలో ముందుకు సాగాలంటే.. నూతన వ్యవసాయ, పారిశ్రామిక, ఆర్థిక విధానాలు కావాలి. కొత్త సామాజిక, ఆర్థిక, రాజకీయ ఎజెండా కోసం దారులు వెతకాలి.
బలమైన కేంద్రం-బలహీన రాష్ట్రాలు అనేలా పాలన ఉంది. రాష్ట్రాల హక్కులు హననం పరాకాష్టకు చేరింది. రాష్ట్రాలను ఆర్థికంగా బలహీనపరిచే కుట్ర జరుగుతుంది. రాష్ట్రాలకు రావాల్సిన పన్నులు వాటా ఎగ్గొట్టే యత్నం జరుగుతుంది. రాష్ట్రాల ఆర్థిక స్వేచ్చను దెబ్బతిస్తూ రకరకాల ఆంక్షలు విధిస్తుంది. కేంద్రం మాత్రం నియమాలకు కట్టుబడకుండా విచ్చలవిడిగా అప్పులు చేస్తుంది. అన్ని నిబంధనలు పాటిస్తూ.. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్న తెలంగాణకు కేంద్రం వైఖరి గుదిబండగా మారింది. రాష్ట్రాలపై ఆంక్షలను కేంద్రం ఎత్తివేయాలి. దేశాన్ని నడిపించడంలో వైఫల్యం ఎవరిది?. ఐదేళ్లకోకసారి జరిగే అధికార మార్పిడి ముఖ్యం కాదు.. సమస్యలకు పరిష్కారం చూపే ప్రగతిశీల ఎజెండా కావాలి. దేశానికి నూతన గమ్యాన్ని నిర్వచించాలి. దేశంలో గుణాత్మక మార్పు రావాలి.
కేంద్రానికి తలొగ్గి రైతు వ్యతిరేక విధానాలు అమలు చేయకపోవడం వల్ల ఐదేళ్లలో రూ. 25 వేల కోట్లు కోల్పోవాల్సి వచ్చింది. రైతులపై భారం వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దంగా లేదు. తెలంగాణ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకోవడం నా విధి. అదే సమయంలో దేశ ప్రయోజనాల కోసం విద్వేష రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాటం చేయడం మన అందరి బాధ్యత. రాజీ పడే ధోరణి లేదన్నారు. సమస్త ప్రజానీకానికి సంక్షేమ ఫలాలు పంచుతున్న తెలంగాణ అజెండా.. దేశమంతా అమలు కావాలి. ఉజ్వల భారత్ నిర్మాణం కోసం జరిగే పోరాటంలో తెలంగాణ ప్రజలు అగ్రభాగాన నిలవాలి. దేశంలో గుణాత్మక పరివర్తన సాధించే శక్తి భగవంతుడు మనందరికి ప్రసాదించాలి’’ అని కేసీఆర్ కోరారు.