ఓసీల కంటే బీసీలకే బీజేపీ ఇప్పటివరకు ఎక్కువ సీట్లను కేటాయించింది. మహిళలకు 13 సీట్లు ఖరారు చేసింది. మిగిలిన జాబితాలో కూడ బీసీలు, మహిళలకు కూడ ప్రాధాన్యతను కమలం పార్టీ కొనసాగించే అవకాశం ఉంది
హైదరాబాద్: బీజేపీ ప్రకటించిన మూడు జాబితాల్లో 33 మంది బీసీలకు టిక్కెట్లను కేటాయించింది. మూడు జాబితాల్లో 13 మంది మహిళలకు బీజేపీ టిక్కెట్లు ఇచ్చింది.
గత నెల 22న 52 మందితో బీజేపీ తొలి జాబితాను విడుదల చేసింది. తొలి జాబితాలో 20 మంది బీసీలకు బీజేపీ టిక్కెట్లను కేటాయించింది. ఇవాళ ప్రకటించిన జాబితాలో 13 మంది బీసీలకు టిక్కెట్లను బీజేపీ ఇచ్చింది. మూడు జాబితాల్లో 33 మందికి కమలం పార్టీ టిక్కెట్లు కేటాయించింది. జనసేనకు గరిష్టంగా 10 అసెంబ్లీ స్థానాలను కేటాయించాలని బీజేపీ భావిస్తుంది. పవన్ కళ్యాణ్ విదేశీ పర్యటన నుండి వచ్చిన తర్వాత ఈ సీట్ల సర్ధుబాటుపై చర్చలు జరుగుతాయి.
మూడు జాబితాల్లో కలిపి 31 మంది ఓసీలకు బీజేపీ టిక్కెట్లను కేటాయించింది. తొలి జాబితాలో 18 మంది ఓసీలకు, రెండో జాబితాలో ప్రకటించిన ఒక్క అభ్యర్ధి కూడ ఓసీ సామాజిక వర్గానికి చెందినవాడు. ఇవాళ ప్రకటించిన మూడో జాబితాలో కూడ బీజేపీ 12 మందికి టిక్కెట్లు అందించింది. బీసీల కంటే రెండు సీట్లు తక్కువగానే ఓసీలకు బీజేపీ టిక్కెట్లను కేటాయించింది.మూడు జాబితాల్లో 13 స్థానాల్లో ఎస్సీలకు, 9 స్థానాలను ఎస్టీలకు కేటాయించింది కమలం పార్టీ.
ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ 19 స్థానాల జాబితాను ప్రకటించిన తర్వాత నాలుగో జాబితాను బీజేపీ విడుదల చేయనుంది. ఇత పార్టీల్లో టిక్కెట్లు ఆశించి భంగపడ్డ వారికి బీజేపీ గాలం వేయనుంది.తెలంగాణలో ఈ దఫా అధికారాన్ని దక్కించుకోవాలని బీజేపీ ప్లాన్ చేస్తుంది. గత కొంతకాలంగా వ్యూహత్మకంగా ఆ పార్టీ పావులు కదుపుతుంది.
also read:దత్తన్న కూతురికి బీజేపీ మొండిచేయి: ముషీరాబాద్ నుండి రాజుకు కమలం టిక్కెట్టు
అయితే ఇటీవల కాలంలో చోటు చేసుకున్న పరిణామాలు బీజేపీని ఆత్మరక్షణలో పడేశాయి. బీజేపీలో చేరిన కీలక నేతలు తిరిగి కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉందని ప్రచారం సాగుతుంది.ఈ ప్రచారానికి అనుగుణంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్ వెంకటస్వామిలు బీజేపీని వీడి కాంగ్రెస్ లో చేరారు. ఈ పరిణామం పార్టీని రాజకీయంగా ఇబ్బంది పెట్టింది. అయితే పార్టీని కొందరు వీడడం వల్ల నష్టం లేదనే అభిప్రాయంతో కమల దళం ఉంది.
ఈ నెల 7, 11 తేదీల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణలో ప్రచారం నిర్వహించనున్నారు. మోడీతోపాటు బీజేపీ అగ్రనేతలు రాష్ట్రంలో విస్తృతంగా ప్రచారం చేయనున్నారు.