
ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ (niramala sitharaman) దారుణమైన బడ్జెట్ ప్రవేశపెట్టారని ఎద్దేవా చేశారు తెలంగాణ సీఎం కేసీఆర్ (kcr). కేంద్ర బడ్జెట్‌పై ఆయన ప్రగతి భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ... బడ్జెట్ (union budget 2022) ప్రవేశపెడుతూ మహాభారతంలోని శాంతిపర్వం శ్లోకాన్ని నిర్మల చెప్పారని కేసీఆర్ అన్నారు. ఉద్యోగుల ఆశలపై కేంద్ర బడ్జెట్ నీళ్లు చల్లిందని కేసీఆర్ మండిపడ్డారు. ఇన్‌కమ్‌ట్యాక్స్ శ్లాబ్‌లలో మార్పులు చేయకపోవడం విచారకరమన్నారు. కరోనా కష్టకాలంలోనూ వైద్య రంగాన్ని పట్టించుకోలేదని.. కేంద్ర బడ్జెట్ తీవ్ర నిరాశకు గురిచేసిందని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్‌లో పసలేదని.. అన్ని వర్గాలను కేంద్ర బడ్జెట్ నిరాశపరిచిందని సీఎం దుయ్యబట్టారు.
ఇది గోల్‌మాల్ బడ్జెట్‌గా కేసీఆర్ అభివర్ణించారు. వ్యవసాయ రంగానికి జీరో బడ్జెట్ అని.. ఈ బడ్జెట్‌కు దశ దిశా లేదన్నారు. శాంతిపర్వం శ్లోకం చెప్పి, ప్రవచించింది అధర్మం, అసత్యమని కేసీఆర్ ఎద్దేవా చేశారు. బడ్జెట్‌లో అందరికీ గుండుసున్నా అన్నారు. దేశంలో ఎస్సీ, ఎస్టీల జనాభా చాలా పెరిగిందని.. ఎస్సీల జనాభాపై కేంద్రం చెబుతున్న లెక్కలు తప్పు అని దుయ్యబట్టారు. సాగుచట్టాల ఉద్యమంలో మరణించిన రైతుల గురించి బడ్జెట్‌లో కనీసం ప్రస్తావించలేదని కేసీఆర్ ఎద్దేవా చేశారు. ఎరువుల మీద రూ.35 వేల కోట్ల సబ్సిడీ తగ్గించారని ముఖ్యమంత్రి మండిపడ్డారు.
ఈ ప్రభుత్వం ఎవరి కోసం ఉన్నట్లు అని కేసీఆర్ ప్రశ్నించారు. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి రూ.25 వేల కోట్ల కోత పెట్టారని.. రైతుల నుంచి విద్యుత్ ఛార్జీలు వసూలు చేయాలన్నది అసలు సంగతి అని సీఎం మండిపడ్డారు. ఘోరమైన పద్ధతిలో దేశాన్ని నాశనం చేస్తున్నారని... దిక్కుమాలిన గుజరాత్ మోడల్ అడ్డం పెట్టుకుని ప్రధాని అయ్యారంటూ మోడీపై కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవిత్రమైన గంగానదిలో శవాలు తేలేలా చేసిన ప్రభుత్వమంటూ సీఎం మండిపడ్డారు. కరోనా సమయంలో ఈ ప్రభుత్వం ఎంత దరిద్రంగా వ్యవహరించిందో చూశామని ఆయన గుర్తుచేశారు.
మిడతల దాడిని ఎదుర్కొనేందుకు ఈ దేశంలో వ్యవస్థ లేదని.. వైరస్‌లు వస్తుంటాయి, తెలివైన ప్రభుత్వాలు వైద్య సదుపాయాలను మెరుగుపరచుకోవాలని కేసీఆర్ సూచించారు. అందుకే తెలంగాణలో రూ.10 వేల కోట్లు కేటాయించామని, హైదరాబాద్‌లోనే నాలుగు పెద్దాసుపత్రులను నిర్మిస్తున్నామని సీఎం అన్నారు. బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి ఒక్క రూపాయి పెంచలేదని.. కరోనా సమయంలో పెంచకపోగా ఇంకా తగ్గించారని కేసీఆర్ తెలిపారు.