K Chandrashekar Rao : ధరణి వుండాలంటే బీఆర్ఎస్ మళ్లీ రావాల్సిందే : కేసీఆర్

By Siva KodatiFirst Published Nov 23, 2023, 3:38 PM IST
Highlights

ఎన్నికలు రాగానే ఇష్టమొచ్చినట్లుగా అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు తెలంగాణ సీఎం కేసీఆర్. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని, ధరణి వుండాలంటే బీఆర్ఎస్‌నే గెలిపించాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.

ఎన్నికలు రాగానే ఇష్టమొచ్చినట్లుగా అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు తెలంగాణ సీఎం కేసీఆర్. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం వికారాబాద్‌లో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన ప్రసంగిస్తూ.. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా రావాల్సినంత పరిణతి రాలేదన్నారు. ఎన్నికల్లో అభ్యర్ధులతో పాటు వారి పార్టీ చరిత్ర కూడా చూడాలని.. ప్రజల గురించి ఏ పార్టీ ఎలా ఆలోచిస్తుందో గమనించి ఓటు వేయాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. 

గడిచిన పదేళ్లకాలంలో తెలంగాణలో ఏం మార్పు వచ్చిందో బేరీజు వేయాలని.. కంటి వెలుగు కార్యక్రమం కింద 3 కోట్ల మందికి కంటి పరీక్షలు చేయించామని కేసీఆర్ తెలిపారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని, ధరణి వుండాలంటే బీఆర్ఎస్‌నే గెలిపించాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ధరణి తీసేస్తే మళ్లీ లంచాల కాలం వస్తుందని కేసీఆర్ హెచ్చరించారు. 

ALso Read: KTR: ప్రజలను నమ్మించలేక అసత్య ప్రచారాలు.. కాంగ్రెస్, బీజేపీలపై కేటీఆర్ ఫైర్

అంతకుముందు మహేశ్వరంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ ప్రసంగిస్తూ.. కాంగ్రెస్ తీరు వంటలు చేసి పెట్టండి మేము వడ్డిస్తామన్న చందంగా వుందని విమర్శించారు. ఆర్ధిక క్రమశిక్షణ పాటిస్తున్నందునే రాష్ట్రంలో సంపద పెరిగిందని, ఇందుకోసం బీఆర్ఎస్ ఎంతో శ్రమించిందని కేసీఆర్ తెలిపారు. కానీ దానిని తుంచడానికి కాంగ్రెస్ పార్టీ మళ్లీ కుట్రలు చేస్తోందని.. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే పింఛన్ పెంచుతామని కేసీఆర్ హామీ ఇచ్చారు. 

ఫాక్స్‌కాన్ పరిశ్రమతో లక్ష మంది యువతకు ఉద్యోగాలు వస్తాయని, ఔటర్ చుట్టూ త్వరలోనే పైప్‌లైన్ రాబోతోందని కేసీఆర్ వెల్లడించారు. రైతుబంధును ఎకరానికి రూ.16 వేలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ధరణిని తీసేసి కాంగ్రెస్ దాని స్థానంలో భూమాతను తెస్తామంటోందని.. అది భూమాత కాదని భూమేత అంటూ కేసీఆర్ ఎద్దేవా చేశారు. 

click me!