
కాంగ్రెస్, బీజేపీలు ఒక్క అవకాశం ఇవ్వాలని అంటున్నాయని.. 50 ఏళ్లలో ఎన్ని అవకాశాలు ఇచ్చామని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. ఆదివారం సూర్యాపేటలో జరిగిన బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు. భువనగిరి, సూర్యాపేటలలో మెడికల్ కాలేజీ ఇవ్వాలనే ఆలోచన వీరికి వచ్చిందా అని కేసీఆర్ నిలదీశారు. గత 50 ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేసిందన్నారు. కాంగ్రెస్ తన జన్మలో రూ.1000 పెన్షన్ ఇవ్వలేదని.. రూ.200 పెన్షన్ ముఖాన కొట్టారని సీఎం ఎద్దేవా చేశారు. చత్తీస్‌గఢ్, కర్ణాటకలలో రూ.4 వేల పెన్షన్ ఎందుకు ఇవ్వడం లేదని కేసీఆర్ నిలదీశారు. అధికారంలోకి వస్తే రూ.4 వేలు పెన్షన్ ఇస్తామని అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పకుండా ఈసారి పెన్షన్ పెంచుతానని సీఎం హామీ ఇచ్చారు.
మాకు పెన్షన్ పెంచడం చేత కాదా అని కేసీఆర్ ప్రశ్నించారు. ఒకడు మోటర్లకు మీటర్లు పెట్టాలని అంటున్నాడని.. మరొకడు మూడు గంటల ఉచిత విద్యుత్ చాలు అంటున్నాడని కాంగ్రెస్, బీజేపీలకు సీఎం చురకలంటించారు. మళ్లీ మనకు పాత రోజులు కావాలా అని కేసీఆర్ ప్రశ్నించారు. దరఖాస్తు లేకుండానే రైతు బంధు పైసలు ఇస్తున్నామని.. ధరణి తీసేస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని సీఎం ఫైర్ అయ్యారు. ధరణి తీసేస్తే మళ్లీ పాత కథే మొదటికొస్తుందన్నారు.
మళ్లీ దరఖాస్తులతో ఆఫీసుల చుట్టూ రైతులు తిరగాలా అని సీఎం ప్రశ్నించారు. ఒక్కసారి ధరణిలోకి భూమి ఎక్కితే మార్చే మొనగాడు వున్నాడా అని కేసీఆర్ నిలదీశారు. రైతు భూమిని మార్చాలంటే సీఎంకు కూడా పవర్ లేదని.. భూమిని మార్చే అధికారం రైతు బొటన వేలుకే వుందన్నారు. ధరణితో రైతుకే అధికారం ఇచ్చామని.. రైతులు ఆలోచన చేయాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ వస్తే మళ్లీ పైరవీకారుల రాజ్యమేనని సీఎం హెచ్చరించారు.
మొన్న ఒకాయన పాదయాత్ర చేశాడంటూ సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు కేసీఆర్. నల్గొండలో అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ రాబోతోందని.. దశాబ్ధాల తరబడి మూసీ మురికి నీరు తాగించారని సీఎం మండిపడ్డారు. మోసపోతే గోస పడతాం.. ఆలోచించండి అంటూ కేసీఆర్ పిలుపునిచ్చారు. సూర్యాపేట జిల్లాలో నలుగురు ఎమ్మెల్యేలు గెలిచినట్లేనని.. అందులో అనుమానమే లేదని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు.
రూ.37 వేల కోట్ల రైతుల రుణమాఫీ చేశామని.. దేశంలో ఇంత పెద్ద మొత్తంలో రుణమాఫీ ఎక్కడా చేయలేదని కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ మూడు కోట్ల టన్నుల వడ్లు పండిస్తోందని.. త్వరలో పంజాబ్‌ను మించి నాలుగు కోట్ల టన్నుల వడ్లు పండించబోతున్నామని కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణలో వలస పోయినవాళ్లంతా వాపస్ వచ్చారని సీఎం గుర్తుచేశారు.
సూర్యాపేట జిల్లా ప్రజలపై వరాల జల్లు కురిపించారు కేసీఆర్. ప్రతి గ్రామ పంచాయతీకి రూ.10 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. సూర్యాపేట జిల్లా కావడం ఓ చరిత్ర అన్నారు. 23వ జిల్లా కలెక్టరేట్‌ను ప్రారంభించుకోవడం సంతోషంగా వుందన్నారు. తలసరి ఆదాయంలో తెలంగాణ నెంబర్ వన్‌గా నిలిచిందని సీఎం పేర్కొన్నారు. తలసరి విద్యుత్ వినియోగంలోనూ రాష్ట్రం నెంబర్‌వన్‌గా నిలిచిందన్నారు.
కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీలో సరిగా లేవని.. జట్టుకట్టి పట్టుబట్టి పనిచేస్తే ఫలితాలు ఇలానే వుంటాయన్నారు. ఇంకా చాలా అద్భుతాలు జరగాల్సి వుందని.. సూర్యాపేటలో అద్భుతమైన కళాభారతిని నిర్మిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. సూర్యాపేట మున్సిపాలిటీకి రూ.50 కోట్లు మంజూరు చేస్తున్నామన్నారు. వందకు వంద శాతం సూర్యాపేటను జిల్లా చేస్తానని చెప్పానని .. ఇచ్చిన మాట ప్రకారం సూర్యాపేట జిల్లా చేశానని కేసీఆర్ గుర్తుచేశారు.