కేంద్రంలోని ప్రభుత్వాల అసమర్ధ విధానాలతో ప్రజలకు అవసరమైన సాగు, తాగు నీరు కూడా అందని పరిస్థితి నెలకొందని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు.
కొత్తగూడెం:దేశాన్ని రక్షించడం కోసం ఖమ్మం వేదికగా శంఖారావం పూరించబోతున్నామని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ నెల 18న ఖమ్మం సభను నిర్వహిస్తున్నామన్నారు.ఈ సభలో పలు రాష్ట్రాల సీఎంలు పాల్గొంటారని కేసీఆర్ చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెంలో నూతన కలెక్టరేట్ ను తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రం పనిచేసిన స్థాయిలో పనిచేసినట్టుగా కేంద్రం పనిచేస్తే దేశం అభివృద్దిలో ముందుకు సాగేదన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరించిన విధానాల కారణంగా తెలంగాణ రాష్ట్రం మూడు లక్షల కోట్లను కోల్పోయిందని కేసీఆర్ విమర్శించారు.
దేశంలోని అనేక నదుల్లో పుష్కలమైనా నీటి వనరులున్నా దుర్మార్గమైన నీటి పారుదల పాలసీల వల్ల సాగు, తాగు నీటికి కూడా నోచుకోలేకపోతున్నామని కేసీఆర్ చెప్పారు. దేశంలో నీళ్లున్నా నీటి యుద్ధాలు ఎందుకు సాగుతున్నాయని కేసీఆర్ ప్రశ్నించారు. కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్ ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఇదే రకమైన పరిస్థితి నెలకొందని కేసీఆర్ విమర్శించారు.
తెలంగాణ మినహా దేశంలోని ఏ ఒక్క రాష్ట్రంలో కూడ 24 గంటల పాటు విద్యుత్ సరఫరా లేదని కేసీఆర్ చెప్పారు. మంచినీళ్లు, విద్యుత్ , సాగు నీళ్లు , ఉద్యోగాలు ఇవ్వరా అని కేంద్రాన్ని ప్రశ్నించారు. ప్రజలకు అవసరమైనవాటిని ఇవ్వకుండా ఏమి ఇస్తారని కేసీఆర్ ప్రశ్నించారు. ఉపన్యాసాలు ఎన్ని రోజులు వినాలో చెప్పాలని ఆయన అడిగారు. ఎన్నికల్లో పార్టీలు, నాయకులు గెలుస్తున్నారన్నారు. ఎన్నికల్లో ప్రజలు గెలవాల్సిన పరిస్థితులు రావాలని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. దేశంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా దుష్ట పన్నాగాలు సాగుతున్నాయని కేసీఆర్ ఆరోపించారు.
కొత్తగూడెం జిల్లాకు ఇంకా అనేక కార్యక్రమాలు రానున్నాయని కేసీఆర్ హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల గురించి చెప్పాలంటే సమయం సరిపోదన్నారు. కేసీఆర్ కిట్ పథకం పూర్తి మానవీయ కోణంలో అమలు చేస్తున్నామన్నారు. తమ ప్రభుత్వం అమలు చేసే పథకాలన్నీ ఇదే తరహలో ఉంటాయని కేసీఆర్ వివరించారు.
ఐక్య పోరాటంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని కేసీఆర్ చెప్పారు. ఎనిమిదేళ్ల తెలంగాణకు ఇ.ప్పటి తెలంగాణకు పోలికే లేదని కేసీఆర్ తెలిపారు. తెలంగాణ ఏర్పడిననాడు తెలంగాణ తలసరి ఆదాయం రూ. 87 వేలుగా చెప్పారు. కానీ ఈ నాడు తెలంగాణ తలసరి ఆదాయం రూ. 2,78 లక్షలుగా ఆయన పేర్కొన్నారు. 2014లో తెలంగాణ జీఎస్ డీపీ రూ. 5 లక్షల కోట్లుగా చెప్పారు. ఇప్పుడు తెలంగాణ జీఎస్ డీపీ రూ. 11.5 లక్షల కోట్లకు చేరిందన్నారు. విద్యుత్ వినియోగంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని కేసీఆర్ ప్రకటించారు.
also read:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్: ప్రారంభించిన సీఎం కేసీఆర్
కొత్తగూడెం ప్రజల్లో చైతన్యం ఎక్కువ అని కేసీఆర్ చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో తనను అరెస్ట్ చేసి ఖమ్మం జైల్లో నిర్భంధించిన సమయంలో ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు సాగిన విషయాన్ని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. కొత్తగూడెం జిల్లాకు మెడికల్ కాలేజీ రావడం తనకు సంతోషంగా ఉందన్నారు. కొత్తగూడెం మైనింగ్ ఇనిస్టిట్యూట్ కు అవసరమైన సిబ్బంది, నిధులను మంజూరు చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు.