మీటర్లు, విద్యుత్ సంస్కరణలు.. విరాళాలిచ్చే కార్పోరేట్ల కోసమే: ప్రధాని మోడీపై కేసీఆర్ ఆరోపణలు

Siva Kodati |  
Published : Feb 13, 2022, 06:45 PM ISTUpdated : Feb 13, 2022, 08:30 PM IST
మీటర్లు, విద్యుత్ సంస్కరణలు.. విరాళాలిచ్చే కార్పోరేట్ల కోసమే: ప్రధాని మోడీపై కేసీఆర్ ఆరోపణలు

సారాంశం

విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించి, బీజేపీకి విరాళాలు ఇచ్చే వాళ్ల దగ్గరి నుంచి సౌర విద్యుత్ కొనిపించాలని చూస్తున్నారని సీఎం కేసీఆర్ ఆరోపించారు. 40 వేల మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్ట్‌ల నిర్మాణం పూర్తయినా కరెంట్ ఉత్పత్తి చేయనివ్వడం లేదని.. కేంద్ర ప్రభుత్వ తప్పుడు విద్యుత్ విధానం వల్లే ఈ పరిస్ధితి వచ్చిందని కేసీఆర్ ఆరోపించారు. 

ప్రధాని నరేంద్ర మోడీపై (narendra modi) మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు తెలంగాణ సీఎం కేసీఆర్ (kcr). ఆదివారం ప్రగతి భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మోడీ చెప్పేది ఒకటి, చేసేది ఒకటన్నారు. మోడీ అబద్ధాలు ఎక్కువగా చెబుతున్నారని కేసీఆర్ ఎద్దేవా చేశారు. మోడీ వల్ల దేశం ఎంత నాశనమవుతుందో వివరిస్తూ ఎంతోమంది పుస్తకాలు రాస్తున్నారని కేసీఆర్ దుయ్యబట్టారు. విద్యుత్ సంస్కరణలపైనా అబద్ధాలే చెబుతున్నారని సీఎం ఆరోపించారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు పెట్టాల్సిందేనని ముసాయిదా బిల్లులో ప్రస్తావించారని కేసీఆర్ దుయ్యబట్టారు. 

మోడీ రాజ్యాంగాన్ని కూడా ఉల్లంఘించారని... పార్లమెంట్‌లో ఆమోదం పొందకముందే బిల్లును అమలు చేస్తున్నారని ముఖ్యమంత్రి ఆరోపించారు. ఏపీలో ఇప్పటికే కొన్ని వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు పెట్టారని.. మీటర్లు పెడుతున్న రాష్ట్రాలకు 0.5 శాతం ఎఫ్ఆర్‌బీఎం అదనంగా ఇస్తామంటున్నారని కేసీఆర్ తెలిపారు. మీటర్లు పెట్టమనకుండానే జగన్‌మోహన్ రెడ్డి (ys jagan) పెట్టారా అని సీఎం ప్రశ్నించారు. తెలంగాణలో విద్యుత్ సంస్కరణలు అమలు చేయట్లేదని వచ్చే డబ్బులు కూడా ఆపేస్తున్నారని కేసీఆర్ ఆరోపించారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడికి ఇవేమీ తెలియదని.. రాష్ట్రానికి 25 వేల కోట్ల నష్టం వస్తుందని తెలిసినా, తాను మీటర్లు పెట్టలేదని సీఎం వెల్లడించారు. 

మిషన్ భగీరథ ప్రారంభ సభలోనూ మోడీ అబద్ధాలే చెప్పారంటూ కేసీఆర్ దుయ్యబట్టారు. తెలంగాణకు యూనిట్ రూ.1.10కే ఇస్తున్నట్లు మోడీ చెప్పారని.. నా పక్కనే నిలబడి మోడీ అబద్ధం చెబుతున్నా మర్యాద కోసం తాను మాట్లాడలేకపోయానని కేసీఆర్ గుర్తుచేశారు. అసలు ఎప్పుడైనా తెలంగాణకు యూనిట్ రూ.1.10కే విద్యుత్ ఇచ్చారా అని మోడీ సమాధానం చెప్పాలని సీఎం డిమాండ్ చేశారు. 40 వేల మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్ట్‌ల నిర్మాణం పూర్తయినా కరెంట్ ఉత్పత్తి చేయనివ్వడం లేదని.. కేంద్ర ప్రభుత్వ తప్పుడు విద్యుత్ విధానం వల్లే ఈ పరిస్ధితి వచ్చిందని కేసీఆర్ ఆరోపించారు. 

బీజేపీలో ప్రతి ఒక్కరూ అబద్ధాలే చెబుతున్నారని.. దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారని సీఎం మండిపడ్డారు. శ్రీశైలం, సాగర్‌లో జల విద్యుత్ ఉత్పత్తిని ఆపేసి అయినా సరే.. సౌర విద్యుత్ కొనాలని ఒత్తిడి చేస్తున్నారని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించి, బీజేపీకి విరాళాలు ఇచ్చే వాళ్ల దగ్గరి నుంచి సౌర విద్యుత్ కొనిపించాలని చూస్తున్నారని సీఎం ఆరోపించారు. 12 శాతం వృద్ధి వుంటే ఎక్కడైనా ఆరేళ్లలో రెట్టింపు అవుతుందని.. దానికి మోడీ అవసరం లేదని కేసీఆర్ వ్యాఖ్యానించారు. 

2025 నాటికి 5 లక్షల కోట్ల ఆర్ధిక వృద్ధికి ప్రధాని, ఆర్ధిక మంత్రి అవసరం లేదని సహజంగా జరిగేదే అని సీఎం పేర్కొన్నారు. చేతనైతే చైనాలాగా, సింగపూర్‌లాగా చేయాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. మోడీకి ఇచ్చిన టైమ్‌లో 80 శాతం అయిపోయిందని.. కిషన్‌రెడ్డి (kishan reddy) కూడా అలా మాట్లాడటం ధర్మం కాదన్నారు. బడ్జెట్ కేసీఆర్‌కు అర్ధం కాలేదని కిషన్‌రెడ్డి అంటున్నారని.. ఆయనకేం అర్ధమైందో, తనకు అర్ధం కావడం లేదంటూ కేసీఆర్ దుయ్యబట్టారు. 

మాకు అర్ధమయ్యే మీ రంగు బయటపెట్టామని, 40 కోట్లమంది దళితులకు 12 వేల కోట్లు కేటాయించింది నిజం కాదా అని సీఎం ప్రశ్నించారు. అన్నీ అమ్మేస్తున్నారని.. ఇప్పుడు విద్యుత్ అమ్మడానికి సిద్ధమయ్యారని కేసీఆర్ ఆరోపించారు. డిస్కమ్‌లను ప్రైవేట్‌పరం చేయాలనుకోవడం చాలా దారుణమన్నారు. విద్యుత్ ప్రైవేట్‌పరమైతే ఇబ్బడిముబ్బడిగా ఛార్జీలు పెరిగి జనం చస్తారని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Singer Mangli in Multiple Controversies: మంగ్లీ చుట్టూ ఇన్ని వివాదాలా? | Asianet News Telugu
డబ్బులుంటేనే ఎవరైనా.. రేవంత్ రెడ్డి సంచలన ప్రెస్ మీట్ | Asianet News Telugu