కృష్ణా జలాల పంపిణీపై నవంబర్ 15 లోపుగా అభిప్రాయం చెప్పాలని ఏపీకి కృష్ణా ట్రిబ్యునల్ తేల్చి చెప్పింది.
న్యూఢిల్లీ:కృష్ణా జలాల పంపిణీపై నవంబర్ 15 లోపు అభిప్రాయం చెప్పాలని ఏపీకి కృష్ణా ట్రిబ్యునల్ ఆదేశించింది.ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీపై ఉన్న వివాదాన్ని పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వం కృష్ణా ట్రిబ్యునల్ ను ఆదేశించింది. రెండు రాష్ట్రాల మధ్య జలాల పున:పంపిణీ చేయాలని కొంత కాలంగా తెలంగాణ డిమాండ్ చేస్తుంది. ఈ నెల మొదటి వారంలో నిర్వహించిన కేంద్ర కేబినెట్ సమావేశం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.ఇందులో భాగంగా కృష్ణా ట్రిబ్యునల్ సమావేశం న్యూఢిల్లీలో బుధవారంనాడు జరిగింది. రెండు రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
also read:తెలంగాణకు బీజేపీ ఎన్నికల తాయిలాలు:కేంద్ర కేబినెట్‌లో మూడు కీలకాంశాలకు గ్రీన్ సిగ్నల్
కృష్ణా జలాల వివాదంపై పూర్తి స్థాయిలో చర్చించి తగిన ఆదేశాలు ఇవ్వాలని కేంద్రం ఆదేశించింది. కేంద్రం ఆదేశాల మేరకు ఈ నెల 6వ తేదీన ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ నోటిఫికేషన్ పై పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని ఏపీ ప్రభుత్వం అభిప్రాయపడింది. ఇందుకు తమకు సమయం కావాలని కోరింది. వెంటనే నీటి పంపకాలు చేపట్టాలని తెలంగాణ కృష్ణా ట్రిబ్యునల్ కోరింది. ఏపీ ప్రభుత్వ వినతి మేరకు నోటిఫికేషన్ పై అధ్యయనం కోసం ఏపీ ప్రభుత్వానికి కృష్ణా ట్రిబ్యునల్ సమయం ఇచ్చింది.ఈ నెల 15 లోపుగా తమ అభిప్రాయాలు చెప్పాలని కృష్ణా ట్రిబ్యునల్ ఆదేశించింది.ఈ ఏడాది నవంబర్ 22,23 తేదీల్లో విచారణ నిర్వహిస్తామని కృష్ణా ట్రిబ్యునల్ ప్రకటించింది. అప్పటి వరకు విచారణను వాయిదా వేసింది.