రాష్ట్రంలోకి మిడతల దండు, 8 జిల్లాలు అప్రమత్తంగా ఉండాలి: కేసీఆర్

By narsimha lodeFirst Published Jun 10, 2020, 5:59 PM IST
Highlights

మిడతల దండు ప్రమాదం  పొంచిఉన్న నేపథ్యలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని  తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. మిడతల దండు నుంచి రాష్ట్రాన్ని రక్షించేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. 
 

హైదరాబాద్: మిడతల దండు ప్రమాదం  పొంచిఉన్న నేపథ్యలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని  తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. మిడతల దండు నుంచి రాష్ట్రాన్ని రక్షించేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. 

గత నెలలో మూడు విడతలుగా దేశంలో ప్రవేశించిన మిడతల బృందాలు  మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ వరకే వచ్చాయి. తెలంగాణ వైపు రాలేదు. అయితే తాజాగా ఓ మిడతల దండు తెలంగాణ సమీపంలోకి వచ్చింది. రాష్ట్రానికి 200 కిలోమీటర్ల దూరంలో మహారాష్ట్రలోని రాంటెక్ వద్ద గల అజ్ని అనే గ్రామం వద్ద ప్రస్తుతం మిడతల దండు ఉందని ఆయన చెప్పారు. 

ఈ మిడతల దండు ప్రయాణం దక్షిణం వైపు సాగితే చాలా తక్కువ సమయంలో తెలంగాణలోకి ప్రవేశించే ప్రమాదం పొంచి ఉందన్నారు. ఈ నేపథ్యలో మిడతల దండు నుంచి రాష్ట్రాన్ని కాపాడే చర్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ప్రగతి భవన్ లో సమీక్షించారు. 

మిడతల దండు గమనంపై  కేసీఆర్ సమాచారం తెప్పించుకున్నారు. మిడతల దండు దక్షిణం వైపు వస్తే ఏ క్షణమైనా తెలంగాణకు ముప్పే అని తేలింది. మరోవైపు ఈ నెల 20 నుంచి జూలై 5 వరకు మళ్లీ మిడతల దండు వచ్చే అవకాశం ఉందని నిపుణులు తేల్చారు.

also read:రాయదుర్గంలో మిడతల కలకలం: ఆందోళనలో స్థానికులు

 ఆ సమయంలో తెలంగాణలో వర్షాకాలం పంట సీజన్ ప్రారంభమయి ఉంటుంది. పంటలు మొలకెత్తి ఉంటాయి. మిడతల దండు దాడిచేసిందంటే చాలా నష్టం జరుగుతుందన్నారు. లేత పంటను పీల్చి పారేస్తుంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలోకి మిడతల దండు ప్రవేశించకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సిఎం ఆదేశించారు. 

ఈ సమావేశంలో మంత్రి సత్యవతి రాథోడ్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి జనార్థన్ రెడ్డి, వ్యవసాయ యూనివర్సిటీ విసి ప్రవీణ్ రావు, సిఐపిఎంసి ప్లాంట్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఆర్. సునిత, వ్యవసాయ యూనివర్సిటీ సీనియర్ శాస్త్రవేత్త రహమాన్, రైతుబంధు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, సిఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు తదితరులు పాల్గొన్నారు. 

ఎనిమిది జిల్లాల్లో అప్రమత్తత

మహారాష్ట్ర, చత్తీస్ గఢ్ రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి మిడతల దండు ప్రవేశించే అవకాశం ఉన్నందున ఈ రాష్ట్రాలకు సరిహద్దులో ఉన్న 8 జిల్లాల అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సిఎం ఆదేశించారు. భద్రాచలం, చర్ల, వెంకటాపురం, వాజేడు, పేరూరు, మంగపేట, ఏటూరునాగారం, చెన్నూరు, వేమనపల్లి, కౌటాల, ధర్మాబాద్, బోధన్, జుక్కల్, భాన్సువాడ, నారాయణఖేడ్, జహీరాబాద్ ప్రాంతాల నుంచి మిడతల దండు వచ్చే ప్రమాదం ఉందని సీఎం చెప్పారు. 

భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మంచిర్యాల, ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు పరిస్థితిని గమనించి, తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 

మిడతల దండు రాష్ట్రంలోకి ప్రవేశించకుండా తీసుకున్న చర్యలను పర్యవేక్షించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ నేతృత్యంలో ప్రత్యేక బృందాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఏర్పాటు చేశారు. 

వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి జనార్థన్ రెడ్డి, వ్యవసాయ యూనివర్సిటీ విసి ప్రవీణ్ రావు, సిఐపిఎంసి ప్లాంట్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఆర్. సునిత, వ్యవసాయ యూనివర్సిటీ సీనియర్ శాస్త్రవేత్త రహమాన్ తదితరులతో కూడిన బృందం ఒకటీ రెండు రోజుల్లో ఆదిలాబాద్ లో పర్యటించనుంది. అక్కడే ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో సమావేశం నిర్వహిస్తుంది. మిడతల దండు గమనాన్ని పరిశీలిస్తూ, అవసరమైన  చర్యలను పర్యవేక్షిస్తుంది.
 

click me!