2,157 ఎకరాల భూమి, రూ.43 కోట్ల నిధులు... యాదాద్రిపై వరాల జల్లు కురిపించిన కేసీఆర్

By Siva KodatiFirst Published Sep 30, 2022, 7:35 PM IST
Highlights

యాదాద్రిపై వరాల జల్లు కురిపించారు తెలంగాణ సీఎం కేసీఆర్. వంద ఎకరాల్లో నృసింహ అభయారణ్యాన్ని అభివృద్ధి చేయాలని .. ఆధ్యాత్మిక శోభ వుండేలా అనుబంధ నిర్మాణాలు చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. 

యాదాద్రి అభివృద్ధి కోసం రూ.43 కోట్ల నిధులు మంజూరు చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. వెంటనే ఆ నిధులను విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. శుక్రవారం యాదాద్రి లక్ష్మీ నరసింహా స్వామిని దర్శించుకున్న ఆయన... అనంతరం ఆలయ పునర్నిర్మాణ పనులపై రివ్యూ చేశారు. వైటీడీఏకు 2,157 ఎకరాలు అప్పగిస్తామని హామీ ఇచ్చారు. ఇందులోనే ఆలయ అర్చకులు, ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని అధికారులను ఆదేశించారు. ఇక దాతలు కాటేజీ నిర్మాణాలకు ఇచ్చే విరాళాలకు ఐటీ మినహాయింపు వుంటుందని సీఎం స్పష్టం చేశారు. అలాగే యాదాద్రిలో హెలిప్యాడ్ నిర్మాణం చేయాలని అధికారులను ఆదేశించారు కేసీఆర్. వంద ఎకరాల్లో నృసింహ అభయారణ్యాన్ని అభివృద్ధి చేయాలని సీఎం సూచించారు. యాదాద్రిలో ఆధ్యాత్మిక శోభ వుండేలా అనుబంధ నిర్మాణాలు చేపట్టాలని ఆలయ నిర్వహణ కోసం నిధులు నిల్వ వుండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. 

అంతకుముందు యాదాద్రి ఆలయ విమాన గోపుర నిర్మాణానికి స్వర్ణ తాపడం కోసం కేజీ 16 తులాల బంగారాన్ని సీఎం కేసీఆర్ స్వామి వారికి విరాళంగా అందించారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన విరాళాన్ని సమర్పించారు. విమాన గోపురానికి బంగారు తాపడం కోసం విరాళాలు ఇవ్వాలని గతంలోనే ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. దీంతో పలువురు ప్రముఖులు, భక్తులు నృసింహుడికి బంగారాన్ని సమర్పించారు. 

ఇకపోతే.. అక్టోబర్ 5వ తేదీన టీఆర్ఎస్ఎల్పీతో పాటు పార్టీ విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు సీఎం కేసీఆర్. టీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో జాతీయ పార్టీ ఏర్పాటుపై తీర్మానం చేయనున్నారు. ఆ తర్వాత జరిగే పార్టీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో జాతీయ పార్టీ ఏర్పాటు విషయమై కేసీఆర్ ప్రకటన చేసే అవకాశం ఉంది. అంతేకాదు అదే రోజున జాతీయ పార్టీ కో ఆర్డినేటర్లను కూడా కేసీఆర్ ప్రకటించనున్నారు. దసరా రోజున పలు పార్టీల జాతీయ నేతలను కూడా కేసీఆర్ ఆహ్వానించినట్టుగా సమాచారం. 

ALso REad:టీఆర్ఎస్ కు రూ.80కోట్లతో సొంత చార్టర్డ్ ఫ్లైట్.. దేశవ్యాప్త సుడిగాలి పర్యటనకు కేసీఆర్ రెడీ..

జాతీయ పార్టీ ఏర్పాటుకు సన్నద్ధం అవుతున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కేసీఆర్ దేశవ్యాప్త పర్యటన కోసం ప్రత్యేకంగా ఒక చార్టెడ్ ఫ్లైట్ కొనుగోలు చేయనున్నారు. ఇందుకోసం రూ. 80 కోట్లను వెచ్చించేందుకు ఆ పార్టీ సిద్ధమైంది. 12 సీట్లతో కూడిన ఈ విమానం కొనుగోలుకు సంబంధించి దసరా పర్వదినాన ఆర్డర్ ఇవ్వాలని ఆ పార్టీ నిర్ణయించింది. దసరా రోజున (అక్టోబర్ 5)  కొత్త పార్టీ పేరు ప్రకటన తర్వాత ప్రత్యేక విమానం కొనుగోలుకు పార్టీ నుంచి ఆర్డర్ ఇవ్వనున్నట్లు సమాచారం.  

పార్టీ  ఖజానాలో ఇప్పటికే రూ. 865 కోట్ల మేర నిధులున్నాయి. అయినా విమానం కొనుగోలుకు విరాళాలు సేకరించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రస్తుతం వివిధ రాష్ట్రాల పర్యటనలకు ప్రైవేట్ విమానాలను అద్దెకు తీసుకుని వినియోగిస్తున్నారు. జాతీయ పార్టీ ఏర్పాటు నేపథ్యంలో సొంత విమానం అవసరమని ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తోంది. 2001లో టిఆర్ఎస్‌ను ప్రారంభించాక హెలికాప్టర్ ను వినియోగించడం ద్వారా పార్టీ బలోపేతానికి దోహదం చేసిందని.. దాని ద్వారా గుర్తింపు వచ్చిందని.. ఇప్పుడు సొంత విమానం వాడటం ద్వారా జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తుందని ఆయన పార్టీ నేతలతో పేర్కొన్నట్లు సమాచారం.

click me!