ఇలా చేస్తే లాభాలు తథ్యం: ఆర్టీసీ అధికారులకు కేసీఆర్ కీలక సూచనలు

By Siva KodatiFirst Published Dec 25, 2019, 8:25 PM IST
Highlights

ఆర్టీసీలో కార్గో & పార్శిల్ సేవలను విస్తృత పరిచేందుకు అవసరమైన వ్యూహం సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. 

ఆర్టీసీలో కార్గో & పార్శిల్ సేవలను విస్తృత పరిచేందుకు అవసరమైన వ్యూహం సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. తెలంగాణ ఆర్టీసీపై ప్రగతి భవన్ లో బుధవారం సిఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, ఆర్టీసీ ఎండి సునిల్ శర్మ, ఇడిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించినట్లే, అన్ని చోట్లకూ సరుకు రవాణా చేయాలని చెప్పారు.

Also Read:మాట నిలబెట్టుకున్న కేసీఆర్: ఆర్టీసీ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంపు

ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి ఎంప్లాయిస్ వెల్ఫేర్ బోర్డు చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించిన ముఖ్యమంత్రి, ఈ బోర్డు కూర్పు, పనివిధానాన్ని కూడా ఖరారు చేశారు. ఆర్టీసీ బస్సులు ఎక్కడి నుంచి ఎక్కడికైనా, ఏ మూలకైనా సరుకు రవాణా చేయాలని సీఎం తెలిపారు.

ప్రభుత్వంలోని వివిధ శాఖల ద్వారా జరిగే సరుకు రవాణాను ఇకపై ఖచ్చితంగా ‘ఆర్టీసీ కార్గో అండ్ పార్శిల్ సర్వీస్’ ద్వారానే చేస్తాము... దీనికి సంబంధించి అన్ని శాఖలకు ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు.

బతుకమ్మ చీరలు, విద్యా సంస్థలకు పుస్తకాలు, డిపోల నుంచి బ్రాండీ షాపులకు మద్యం, హాస్పిటళ్లకు మందులు ఇలా ప్రభుత్వ పరంగా జరిగే ప్రతీ సరుకు రవాణా ఇకపై ఆర్టీసీ ద్వారానే జరిగేట్లు చూస్తామని సీఎం వెల్లడించారు.  

కేవలం రాష్ట్ర పరిధిలోనే కాకుండా తెలంగాణ ప్రజలు ఎక్కువగా నివసించే ముంబాయి, బీవండి, సోలాపూర్, నాగపూర్, జగ్దల్ పూర్ తదితర ప్రాంతాలకూ కూడా సరుకు రవాణా చేయాలన్నారు.

సరుకు రవాణా విషయంలో ఎలా వ్యవహరించాలనే విషయంలో ఉద్యోగులకు తగిన శిక్షణ ఇవ్వాలి. సరుకు రవాణాకు అనుగుణంగా బస్సులను సిద్ధం చేయాలి’’ అని ముఖ్యమంత్రి వివరించారు.

ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి, ఎప్పటికప్పుడు ఎదురయ్యే పరిస్థితిని ఎదుర్కోవడానికి ఇప్పటికే ఇచ్చిన హామీ మేరకు ఎంప్లాయి వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

హైదరాబాద్ లోని వివిధ డిపోల నుంచి నేరుగా చెన్నయ్, నాగపూర్, ముంబై తదితర ప్రాంతాలకు వెళ్లే బస్సు సర్వీసుల సంఖ్యను పెంచాలని సిఎం సూచించారు. పెళ్లిళ్లు, విహార యాత్రలకు ఆర్టీసీ బస్సులు ఇచ్చే విషయంలో సరళమైన విధానం అనుసరించాలని చెప్పారు.

Also Read:అశ్వత్థామ రెడ్డికి ఆర్టీసీ యాజమాన్యం భలే షాక్

 ప్రతీ డిపో నుంచి, ప్రధాన కార్యాలయం నుంచి ఇద్దరు చొప్పున ఉద్యోగులు మొత్తం 202 మంది బోర్డులో సభ్యులుగా ఉంటారు. ఇందులో 94 మంది బిసిలు, 38 మంది ఎస్సీలు, 26 మంది ఎస్టీలు, 44 మంది ఓసీలు ఉంటారు.

మొత్తం సభ్యుల్లో మహిళా ఉద్యోగులు 73 మంది ఉంటారు. బోర్డు సమావేశం డిపో పరిధిలో వారానికి ఒకసారి, రీజియన్ పరిధిలో నెలకు ఒకసారి, కార్పొరేషన్ పరిధిలో మూడు నెలలకు ఒకసారి జరుగుతుంది. ఈ సమావేశాల్లో ఉద్యోగులకు ఎదురయ్యే సమస్యలు, ఇబ్బందులను పరిష్కరిస్తారు. 

click me!