
మంత్రి హరీశ్‌రావుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు చేసిన వ్యాఖ్యలపై స్పందించారు సీఎం కేసీఆర్. మైనంపల్లి పార్టీ ఆదేశలు పాటిస్తే మంచిదన్నారు. పార్టీ ఆదేశాలు పాటించకపోతే ఆయన ఇష్టమన్నారు. పోటీ చేస్తారా , చేయరా అనేది మైనంపల్లికే వదిలేస్తున్నామని కేసీఆర్ పేర్కొన్నారు.
కాగా.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు , తొలి జాబితా నేపథ్యంలో టికెట్ దక్కని అసంతృప్తులు బీఆర్ఎస్ అధిష్టానంపై మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్పందించారు. తమ ఎమ్మెల్యేల్లో ఒకరు తన కుటుంబ సభ్యులకు టికెట్ రాకపోవంతో నోరు పారేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి హరీశ్ రావుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని.. సదరు ఎమ్మెల్యే ప్రవర్తనను తాను ఖండిస్తున్నానని కేటీఆర్ తెలిపారు.
Also Read: అక్టోబర్‌లో 16న వరంగల్‌లో భారీ ర్యాలీ.. అదే రోజున బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో : కేసీఆర్
మనమంతా హరీశ్‌కు బాసటగా నిలవాలని మంత్రి ఆకాంక్షించారు. బీఆర్ఎస్ ప్రస్థానం ప్రారంభమైన నాటి నుంచి హరీశ్ అంతర్భాగంగా వున్నారని.. పార్టీ ప్రస్థానంలో మున్ముందు కూడా ఆయన మూలస్తంభంలా వ్యవహరిస్తారని హరీశ్‌కు బాసటగా నిలిచారు కేటీఆర్. సిరిసిల్ల నుంచి తనకు మరోసారి అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా జీవితంలో నిరాశా నిస్పృహలు ఎదురవుతూ వుంటాయన్నారు.