
హైదరాబాద్: గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన కేసీఆర్ పై విమర్శలు సంధించారు. గోషామహల్ అభ్యర్థిని కేసీఆర్ ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు. ఎందుకంటే.. ఈ టికెట్‌ను మజ్లిస్ డిసైడ్ చేస్తుందనే కదా.. అని అన్నారు. గతంలో కూడా ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థిని కేసీఆర్ నిర్ణయించలేదని, మజ్లిస్ పార్టీనే డిసైడ్ చేసిందని ఆరోపించారు. ఈ రోజు కేసీఆర్ 115 స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. గోషామహల్, జనగామ సహా నాలుగు స్థానాలకు అభ్యర్థులపై సస్పెన్సన్ కొనసాగించారు. ఇక్కడ టికెట్లను ప్రకటించలేదు.
ఈ నేపథ్యంలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందిస్తూ బీఆర్ఎస్ పై విమర్శలు చేశారు. ఇక్కడ తానే బీజేపీ నుంచి పోటీ చేస్తానని మరో విషయాన్ని స్పష్టం చేశారు. ఇటీవల తాను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావుతో ఆయన నివాసంలో భేటీ కావడం చర్చనీయాంశమైంది. రాజాసింగ్ త్వరలోనే బీఆర్ఎస్‌లో చేరబోతున్నారా? అనే చర్చ మొదలైంది. చివరకు ఈ వ్యాఖ్యలను రాజాసింగ్ ఖండించాల్సి వచ్చింది. ఈ వాదనలు తెరపైకి రావడానికి మరో బలమైన కారణం ఉన్నది.
కొన్నాళ్ల నుంచి బీజేపీ ఆయనపై సస్పెన్షన్ వేటును కొనసాగిస్తూనే ఉన్నది. అప్పటి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రయత్నించినా ఆయనపై ఈ వేటు తొలగలేదు. ఇప్పటికీ ఆయనపై బీజేపీ సస్పెన్షన్ కొనసాగుతున్నది. బీఆర్ఎస్‌లో చేరే వదంతులు వచ్చే అవకాశాలున్న సందర్భంలో ఆయన తాను బీజేపీ నుంచి పోటీ చేస్తానని ప్రకటించినట్టు తెలుస్తున్నది. అయితే.. ఇది మరో వివాదానికి తెరతీస్తున్నట్టే అనే చర్చ కూడా మొదలైంది.
Also Read: మోయినాబాద్ ఫామ్‌హౌజ్ కేసు: ఆ నలుగురు ఎమ్మెల్యేలకు టికెట్ కన్ఫామ్
రాజాసింగ్ గోషామహల్ స్థానాన్ని వదులుకోవాలని, జహీరాబాద్ నుంచి లోక్ సభకు పోటీ చేయాలని బీజేపీ ఆదేశించినట్టు సమాచారం. కానీ, ఆ ప్రతిపాదనను రాజాసింగ్ అంగీకరించడం లేదు. గోషామహల్ నుంచి దివంగత ముఖేశ్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్‌ను బరిలోకి దింపాలని బీజేపీ భావిస్తున్నట్టు తెలుస్తున్నది. కానీ, గోషామహల్‌లోనే తనకు బలమైన పట్టు ఉన్నదని, ఈ సీటును వదిలిపెట్టబోనని రాజాసింగ్ స్పష్టం చేసినట్టు సమాచారం. ఆయన నిర్ణయం మార్చుకునేవరకు సస్పెన్షన్ కొనసాగించే ఆలోచనలో బీజేపీ ఉన్నట్టు తెలుస్తున్నది.
ఇక విక్రమ్ గౌడ్ కూడా గోషామహల్‌లో యాక్టివ్ అయ్యారు. తాను బీజేపీ టికెట్ పై పోటీ చేస్తానని, అందుకు రాజాసింగ్ మద్దతునూ కోరుతానని ఇది వరకే పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తానే గోషామహల్ నుంచి పోటీ చేస్తానని రాజాసింగ్ చెప్పి.. విక్రమ్ గౌడ్‌కు చెక్ పెట్టదలిచారా? అనే అంశం కూడా చర్చనీయాంశమవుతున్నది.