ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్ ను తెలంగాణ సీఎం కేసీఆర్ తప్పుబట్టారు.
హైదరాబాద్: ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్ ను తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్రంగా ఖండించారు.మోడీ, అదానీ మధ్య సంబంధాలపై ప్రజల దృష్టిని మరల్చేందుకు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను అరెస్ట్ చేశారని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ఢిల్లీ లిక్కర్ స్కాం విషయంలో మనీష్ సిసోడియాను సీబీఐ అధికారులు నిన్న అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో గతంలో కూడ మనీష్ సిసోడియాను సీబీఐ అధికారులు విచారించారు. ఈ కేసులో రెండో చార్జీషీట్ ను దర్యాప్తు సంస్థలు కోర్టుకు సమర్పించాయి. రెండో చార్జీషీట్ లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మనీష్ సిసోడియా వంటి పేర్లను చార్జీషీట్లో చేర్చారు. ఈ చార్జీషీట్ల తర్వాత కూడా అరెస్టులు చోటు చేసుకున్నాయి.
ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను సిబిఐ అరెస్టు చేయడాన్ని ముఖ్యమంత్రి శ్రీ కే. చంద్రశేఖర్ రావు ఖండించారు.
ఈ అరెస్ట్ అదానికి, ప్రధాని మోడీకి నడుమనున్న అనుబంధాన్నుంచి ప్రజల దృష్టిని మళ్ళించడానికి చేసిన పనే తప్ప మరోటి కాదని సీఎం అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వైసీపీకి చెందిన ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి తనయుడు రాఘవరెడ్డిని ఇటీవలనే అరెస్ట్ చేశారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలోని చార్టెడ్ అకౌంటెంట్ బుచ్చిబాబును కూడా అరెస్ట్ చేశారు. బుచ్చిబాబు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు చార్టెడ్ అకౌంటెంట్ గా పనిచేశారు.