ఎమ్మెల్యేల ప్రలోభాల కేసు విచారణను సీజే ధర్మాసనానికి రిఫర్ చేస్తున్నట్టుగా సుప్రీంకోర్టు తెలిపింది.
న్యూఢిల్లీ: ఎమ్మెల్యేల ప్రలోభాల కేసు విచారణ సమయంలో తెలంగాణ సర్కార్ తీరుపై సుప్రీంకోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసింది. విచారణ జరుగుతున్న కేసుకు సంబంధించిన ఆడియో, వీడియోలను ఎలా బయటకు పంపుతారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఆధారాలు దర్యాప్తు సంస్థ వద్దే ఉండాల్సిన విషయాన్ని సుప్రీంకోర్టు ప్రస్తావించింది. ఈ విషయమై తెలంగాణ ప్రభుత్వం తరపున వాదనలు విన్పించిన దుశ్యంత్ ధవే సుప్రీంకోర్టుకు క్షమాపణలు చెప్పారు.
ఎమ్మెల్యేల ప్రలోభాల కేసు విచారణను సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారంనాడు విచారించింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున దుశ్యంత్ ధవే వాదనలు విన్పించారు. మరోవైపు ఈ కేసుకు సంబంధించి ఆధారాలను దేశంలోని అందరికి పంపడాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం తీరుపై అసహనం వ్యక్తం చేసింది. తెలంగాణ సీఎం అనుసరించిన పద్దతి సరికాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.
ఈ కేసు విచారణను సీబీఐకి ఇవ్వవద్దని దుశ్యంత్ ధవే వాదించారు. కేంద్ర ప్రభుత్వం చేతిలో సీబీఐ చిలుకగా మారిందని ధవే సుప్రీంకోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. సీబీఐ, ఈడీ , ఐటీ కేసుల విచారణ సమయాల్లో మీడియాకు లీకులు వస్తున్న విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు.
సింగిల్ జడ్జి ఉత్తర్వులను డివిజన్ బెంచ్ ఒకసారి సమర్ధించిందన్నారు. మరోసారి మరోసారి వ్యతిరేకించిన విషయాన్ని కూడా ధవే ఈ సందర్భంగా ప్రస్తావించారు.
ఎమ్మెల్యేల ప్రలోభాల కేసును సిట్ విచారణ చేస్తున్న సమయంలోనే సీబీఐ విచారణ కోరుతూ బీజేపీ నేతలు పిటిషన్లు దాఖలు చేశారని ధవే చెప్పారు. ఎమ్మెల్యేల ప్రలోభాల కేసును దురుద్దేశ్యంతోనే బీజేపీ నేతలు సీబీఐ విచారణ కోరినట్టుగా ధవే వాదించారు.ఈ కేసు సీబీఐ చేతిలోకి వెళ్తే ఆధారాలన్నీ ధ్వంసమౌతాయని ధవే వాదించారు.
అనంతరం సీజే ధర్మాసనానికి కేసును రిఫర్ చేస్తున్నట్టుగా సుప్రీంకోర్టు తెలిపింది. అయితే తదుపరి విచారణను కూడా సీజేధర్మాసనం నిర్ణయిస్తుందని సుప్రీంకోర్టు ప్రకటించింది.