మానవ మృగాలు మన మధ్యనే తిరుగుతున్నాయి: ప్రియాంక ఘటనపై కేసీఆర్ స్పందన

By sivanagaprasad Kodati  |  First Published Dec 1, 2019, 5:43 PM IST

శంషాబాద్‌లో జరిగిన ఘటన అమానుషమని, రాత్రి వేళలలో మహిళా ఉద్యోగులకు డ్యూటీలు వేయొద్దని ఆయన అధికారులను ఆదేశించారు. అదే సమయంలో మహిళా ఉద్యోగులు రాత్రి 8 గంటల లోపే విధులు ముగించుకుని ఇళ్లకు చేరుకోవాలని కేసీఆర్ సూచించారు. 


డాక్టర్ ప్రియాంక రెడ్డి అత్యాచారం, హత్య ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ప్రగతిభవన్‌లో ఆర్టీసీ కార్మికులతో ముఖాముఖి నిర్వహించిన ఆయన అనంతరం మాట్లాడుతూ.. మానవ మృగాలు మన మధ్యనే తిరుగుతున్నాయన్నారు.

శంషాబాద్‌లో జరిగిన ఘటన అమానుషమని, నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి పోలీసు అధికారులను ఆదేశించారు. ప్రియాంక కేసును త్వరితగతిన విచారించాలని, కేసును వేగంగా విచారించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలని కేసీఆర్ సూచించారు. బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందన్నారు.

Latest Videos

undefined

Also Read:ఆర్టీసీ కార్మికులకు కేసీఆర్ వరాలు: రిటైర్మెంట్ వయస్సు 60 ఏళ్లకు పెంపు

రాత్రి వేళలలో మహిళా ఉద్యోగులకు డ్యూటీలు వేయొద్దని ఆయన అధికారులను ఆదేశించారు. అదే సమయంలో మహిళా ఉద్యోగులు రాత్రి 8 గంటల లోపే విధులు ముగించుకుని ఇళ్లకు చేరుకోవాలని కేసీఆర్ సూచించారు. 

ఒక్క రూట్‌లో కూడా ప్రైవేట్ బస్సులకు అనుమతివ్వమని.. కండక్టర్లు, డ్రైవర్లను కార్మికులు అని పిలిచే పద్ధతికి స్వస్తి కలకాలని ముఖ్యమంత్రి తెలిపారు. యధావిధిగా ఉద్యోగుల ఇంక్రిమెంట్లు ఇస్తామని.. మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం ఇస్తామని సీఎం వెల్లడించారు.

చనిపోయిన ఉద్యోగుల కుటుంబంలో ఒకరికి 8 రోజుల్లోపు ఉద్యోగం కల్పిస్తామని.. కలర్ బ్లైండ్‌నెస్ వున్న వారిని వేరే విధులకు మార్చాలి తప్ప వారిని తొలగించవద్దని కేసీఆర్ అధికారులను ఆదేశించారు.  మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులతో పాటు 3 నెలల చైల్డ్ కేర్ లీవ్స్ ఇస్తామని, మహిళా ఉద్యోగులకు ఖాకీ డ్రెస్ నిబంధన తొలగిస్తామని సీఎం స్పష్టం చేశారు.

మహిళా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి త్వరలోనే కమిటీని ఏర్పాటు చేస్తామని, రెండేళ్లపాటు ఆర్టీసీలో గుర్తింపు యూనియన్ ఎన్నికలు ఉండవని సీఎం తేల్చి చెప్పారు. ఆర్టీసీలో తాత్కాలిక ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని, ప్రతి ఆర్టీసీ ఉద్యోగికి ఏడాదికి లక్ష బోనస్ అందించే పరిస్ధితి రావాలని కేసీఆర్ వెల్లడించారు. 

ఆర్టీసీ కార్మికుల రిటైర్మెంట్ వయస్సును 60 ఏళ్లకు పెంచుతున్నట్టుగా సీఎం కేసీఆర్ ప్రకటించారు. మరోవైపు 52రోజుల పాటు సమ్మె చేసిన కాలానికి జీతాన్ని కూడ చెల్లిస్తామని సీఎం చెప్పారు.ప్రతి ఏటా వెయ్యి కోట్లను బడ్జెట్‌లో ఆర్టీసీకి  కేటాయిస్తామని సీఎం హామీ ఇచ్చారు. నాలుగు మాసాల్లో ఆర్టీసీని లాభాల్లోకి తీసుకొస్తామని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.

Also Read:ప్రియాంక రెడ్డి హత్య: నాడు వరంగల్‌లో ఎన్‌కౌంటర్, నేడు సజ్జనార్ ఏం చేస్తారు?

ఆర్టీసీని కాపాడుకొనేందుకు సంస్థను లాభాల్లోకి తీసుకొచ్చేందుకు కార్మికులు కష్టపడాలని ఆయన సూచించారు. ఆర్టీసీ యూనియన్ల మాటలను నమ్మి మోసపోవద్దని ఆయన చెప్పారు. ఆర్టీసీని కాపాడేందుకు తాను చివరి ప్రయత్నం చేస్తున్నట్టుగా కేసీఆర్ వివరించారు.

click me!