అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు పరిహరం అందిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు.
ఖమ్మం: అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. 10 వేల పరిహారం ఇస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. పరిహారాన్ని కౌలు రైతులకు కూడా వర్తింపజేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. గాలి వానతో రాష్ట్ర వ్యాప్తంగా పంట నష్టం జరిగిందని కేసీఆర్ గుర్తు చేశారు
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని బోనకల్లు మండలం రావినూతలలో దెబ్బతిన్న పంట పొలాలను సీఎం కేసీఆర్ గురువారంనాడు పరిశీలించారు అకాల వర్షాలతో రాష్ట్రంలో 2, 22, 250 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు. అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. అకాల వర్షాలతో దెబ్బతిన్న రైతులను ఆదుకుంటామని కేసీఆర్ చెప్పారు.
రైతులు నిరాశకు గురికావద్దని కేసీఆర్ కోరారు. వ్యవసాయం దండగ అన్న మూర్ఖులు కూడా ఉన్నారని కేసీఆర్ విమర్శించారు. దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని సంక్షేమ పథకాలు తెలంగాణలోనే అమలౌతున్నాయని కేసీఆర్ గుర్తు చేశారు.. దేశంలో రైతుకు లాభం కలిగించే పాలసీలు లేవని ఆయన చెప్పారు. తెలంగాణ తలసరి ఆదాయం రూ. 3 లక్షల 5 వేలుగా ఉందని కేసీఆర్ తెలిపారు. తెలంగాణ తలసరి ఆదాయం ఇంతగా పెరగడానికి వ్యవసాయం ప్రధాన కారణమన్నారు.
దేశంలో డ్రామా జరుగుతుందని కేసీఆర్ చెప్పారు.సమస్యలున్నాయని చెప్పి,నా కేంద్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వదని కేసీఆర్ విమర్శించారు. కేంద్రానికి చెప్పినా గోడకు చెప్పినా ఒక్కటేనని సీఎం ఎద్దేవా చేశారు.గతంలో తమకు ఎలాంటి నష్టపరిహరం ఇవ్వలేదని కేసీఆర్ చెప్పారు. కేంద్రం తీరును నిరసిస్తూ పంట నష్టంపై ఈ దఫా నివేదికను పంపబోమని కేసీఆర్ తేల్చి చెప్పారు. దేశానికి కొత్త వ్యవసాయ పాలసీ అవసరం ఉందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు.