నీటి పంపకాలకు కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయండి: జల్‌శక్తి మంత్రి షెకావత్ తో కేసీఆర్ భేటీ

By narsimha lodeFirst Published Sep 6, 2021, 9:56 PM IST
Highlights

తెలంగాణ సీఎం కేసీఆర్  సోమవారం నాడు కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర షెకావత్ తో భేటీ అయ్యారు. కేంద్రం ఇటీవల జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ పై చర్చించారు. కృష్ణా, గోదావరి బోర్డులను ప్రాజెక్టు పరిధిలోకి తీసుకురావడంపై ఆయన చర్చించారు. ఏపీ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టుల విషయమై ఫిర్యాదు చేసినట్టుగా సమాచారం. మరో వైపు కొత్త ట్రిబ్యునల్ ను ఏర్పాటు చేయాలని కోరారు.

హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్ర షెకావత్ తో సోమవారం నాడు రాత్రి భేటీ అయ్యారు.సుమారు రెండు గంటల పాటు కేసీఆర్ కేంద్ర మంత్రితో భేటీ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల కృష్ణా, గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్టులను బోర్డుల పరిధిలోకి తీసుకొసూ గెజిట్ నోటిఫికేషన్ తీసుకొచ్చింది. ఈ విషయమై కేసీఆర్ కేంద్ర మంత్రితో చర్చించారు. 

కృష్ణా జలాల్లో తెలంగాణకు 50 శాతం నీటి వాటాను కేటాయించాలని కేసీఆర్ కేంద్ర మంత్రిని కోరారు. రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపకాల కోసం కొత్త ట్రిబ్యునల్ ను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కృష్ణా జలాల విషయంలో ఏపీ ప్రభుత్వ వాదనను  తెలంగాణ సీఎం కొట్టిపారేశారు. ఏపీ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టుల విషయంలో  చర్యలు తీసుకోవాలని ఆయన కోరినట్టుగా సమాచారం.ఆరు రోజులుగా సీఎం కేసీఆర్ ఢిల్లీలోనే ఉన్నారు.ఈ నెల 1వ తేదీన ఆయన ఢిల్లీకి వచ్చారు. వాస్తవానికి ఆయన ఈ నెల 3నే హైద్రాబాద్ తిరిగి రావాల్సి ఉంది. కానీ ఆయన మాత్రం కేంద్ర మంత్రులను కలిసేందుకు ఢిల్లీలోనే మకాం వేశారు.

click me!