ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరదలో కొట్టుకుపోతున్న ముగ్గురు విద్యార్థులను స్థానికులు కాపాడారు. మరో వైపు మొండ్రాయి వద్ద లో లెవల్ వంతెనపై బైక్ సహా ఓ వ్యక్తి కొట్టుకుపోతున్న సమయంలో స్థానికులు కాపాడారు.
వరంగల్: వరద నీటిలో కొట్టుకుపోతున్న ఇద్దరు విద్యార్ధులను స్థానికులు సోమవారం నాడు కాపాడారు. ఈ ఘటన హన్మకొండ జిల్లాలో చోటు చేసుకొంది.దామెర మండలం పసరగొండ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ముగ్గురు విద్యార్థులు స్కూల్ నుండి ఇంటికి వస్తున్న సమయంలో భారీ వర్షం కురిసింది.
ఈ వర్షానికి లోలెవల్ వంతెన నుండి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ వరద నీటిని దాటే క్రమంలో ముగ్గురు విద్యార్థులు కొట్టుకుపోయారు. పక్కనే ఉన్న పొదల్లో విద్యార్థులు చిక్కుకొన్నారు. పొదలను పట్టుకొని విద్యార్థులు కేకలు వేశారు. ఈ కేకలు విన్న స్థానికులు తాళ్లు వేసి విద్యార్థులను కాపాడారు.
మరోవైపు వరంగల్ జిల్లా సంగెం మండలం మొండ్రాయి పల్లారుగూడ రహదారిపై ఉన్న లో లెవల్ వంతెన పై ఓ బైక్ సహా ఓ వ్యక్తి కొట్టుకుపోయాడు. స్థానికులు అతడికి తాడు అందించి కాపాడారు.ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో జిల్లా కలెక్టర్ అధికారులను అప్రమత్తం చేశారు. టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేశారు.