ఈడీ, సీబీఐ దాడులు పెరుగుతాయి.. బీజేపీకి అవకాశమిచ్చే పనులొద్దు : ఎమ్మెల్యేలకు కేసీఆర్ వార్నింగ్

By Siva KodatiFirst Published Sep 3, 2022, 8:08 PM IST
Highlights

టీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో సీబీఐ, ఈడీ వంటి కేంద్ర సంస్థల దాడులు పెరుగుతాయని వారికి అవకాశమిచ్చే పనులు చేయొద్దని ఆయన వార్నింగ్ ఇచ్చారు. 

ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో జరిగిన టీఆర్ఎస్ఎల్పీ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. మునుగోడు ఉపఎన్నికలో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. మునుగోడులో కాంగ్రెస్ 2వ స్థానంలో, బీజేపీ 3వ స్థానంలో నిలుస్తాయని కేసీఆర్ జోస్యం చెప్పారు. ప్రతి ఎమ్మెల్యేకు 2 గ్రామాలు చొప్పున కేటాయించారు సీఎం. కేంద్ర ప్రభుత్వ సంస్థలకు భయపడేది లేదన్న ఆయన.. శివసేన, ఆర్జేడీ, ఆప్‌లను కేంద్ర ప్రభుత్వ సంస్థలు టార్గెట్ చేశాయని ఆరోపించారు. బీజేపీ బెదిరింపులను పట్టించుకోవద్దని కేసీఆర్ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు.

ఇతర రాష్ట్రాల్లో చేసినట్లు ఇక్కడ నడవదని.. బీజేపీ మనల్ని ఏం చేయలేదని సీఎం వ్యాఖ్యానించారు. ఈడీ , సీబీఐని చూసి భయపడాల్సిన అవసరం లేదని కేసీఆర్ భరోసా కల్పించారు. కేంద్రం మనల్ని మరింతగా టార్గెట్ చేస్తుందని... వాళ్లకి అవకాశమిచ్చే ఏ పనుల్ని చేయొద్దని సీఎం దిశానిర్దేశం చేశారు. ఈడీ, సీబీఐలను మోడీ సర్కార్ దుర్వినియోగం చేస్తోందన్న ఆయన.. మహారాష్ట్రలో బీజేపీ పాచికలు పనిచేశాయి కానీ, ఢిల్లీ, బీహార్‌లలో ఫెయిల్ అయ్యాయని కేసీఆర్ గుర్తుచేశారు. మునుగోడులో బీజేపీ అడ్రస్ గల్లంతేనని.. వచ్చే ఎన్నికల్లో 80 సీట్లు టీఆర్ఎస్‌కేనని సీఎం పేర్కొన్నారు. 

Also REad:బిజెపికి కౌంటర్: సెప్టెంబర్ 17పై కెసిఆర్ కేబినెట్ కీలక నిర్ణయం

అంతకుముందు కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశం ముగిసింది. దాదాపు మూడు గంటల పాటు జరిగిన భేటీలో కీలక నిర్ణయాలు తీసుకుంది మంత్రి వర్గం. సెప్టెంబర్ 17కు సంబంధించి మంత్రి వర్గ సమావేశంలో ప్రధాన చర్చ జరిగింది. సెప్టెంబర్ 17ను జాతీయ సమైక్యతా దినంగా జరపాలని కేబినెట్ నిర్ణయించింది. 16, 17, 18 తేదీల్లో తెలంగాణ వ్యాప్తంగా వజ్రోత్సవాలు నిర్వహించనున్నారు. ప్రారంభ వేడుకల్ని ఘనంగా నిర్వహించాలని మంత్రిమండలి నిర్ణయించింది. 

ఇక అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, ప్రభుత్వ బిల్లులపై చర్చ జరిగినట్లుగా తెలుస్తోందవి. అలాగే విద్యుత్ బకాయిల విషయమై కేంద్ర ప్రభుత్వ వైఖరి, రాష్ట్రంపై వ్యవహరిస్తున్న తీరుపై ఎలా వ్యవహరించాలనే దానిపై నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. ఇక సీబీఐకి రాష్ట్రంలోకి అనుమతి ఇవ్వరాదన్న అంశంపైనా కేబినెట్ చర్చించినట్లుగా తెలుస్తోంది.

click me!