రైతుబంధు, దళితబంధు పదాలు పుట్టించిందే నేను .. ఎలక్షన్ల కోసం ఈ పథకాలు పెట్టలేదు : కేసీఆర్

By Siva Kodati  |  First Published Nov 2, 2023, 4:10 PM IST

రైతుబంధు, దళితబంధు అనే పదాలు పుట్టించిందే తాను అని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. రైతుబంధు ఎలక్షన్ల కోసం పెట్టిన స్కీమ్ కాదని.. రైతుబంధు పెట్టాలని ఎవ్వరూ తనను అడగలేదని సీఎం పేర్కొన్నారు. 


రైతుబంధు, దళితబంధు అనే పదాలు పుట్టించిందే తాను అని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం బాల్కొండలో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ ప్రసంగించారు. ఆనాడు నెహ్రూ సరిగా ఆలోచించి వుంటే ఎస్సీల జీవితాలు ఎప్పుడో మారిపోయేవని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. దళితబంధు పథకం తన మానసపుత్రిక అని ముఖ్యమంత్రి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ మోటార్లకు మీటర్లు  పెట్టాలని ఒత్తిడి చేసిందని.. ప్రాణం పోయినా పెట్టేది లేదని చెప్పినట్లు తెలంగాణ సీఎం కేసీఆర్ తెలిపారు. 

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా ప్రజాస్వామ్యం పెరగలేదన్నారు. ఓటు కిస్మత్‌ను బదలాయిస్తుందని సీఎం వ్యాఖ్యానించారు. దేశంలో 24 గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణయే అన్నారు కేసీఆర్. నరేంద్ర మోడీకి ప్రైవేటైజేషన్ పిచ్చి పట్టిందని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు ద్వారా వచ్చే నష్టాన్ని ప్రభుత్వమే భరిస్తోందని కేసీఆర్ తెలిపారు. పార్టీలు ఏం మంచి చేశాయో ప్రజలు ఆలోచించాలని ఆయన పిలుపునిచ్చారు. 

Latest Videos

దేశం మొత్తంలో మనది చిన్న వయసున్న రాష్ట్రమని.. మోటార్లకు మీటర్లు పెట్టి డబ్బులు గుంజాలని చూశారని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు చేసిన పది రోజుల్లోనే రైతుల ఖాతాల్లోకి నగదు జమ చేస్తున్నామని సీఎం వెల్లడించారు. తెలంగాణలో వ్యవసాయ స్ధిరీకరణ జరగాలన్నది బీఆర్ఎస్ పాలసీ అని కేసీఆర్ పేర్కొన్నారు. ఎన్నికలు వస్తే అభ్యర్ధులు ఎవరు అనే విషయంపై చర్చ జరుగుతుందని సీఎం అన్నారు. 

ఒక్క ఛాన్స్ ఇవ్వమని కాంగ్రెస్ అడుగుతోందని.. ఇప్పటి వరకు 11 సార్లు అవకాశం ఇస్తే ఏం చేసిందని కేసీఆర్ ప్రశ్నించారు. ఎన్నికలు రాగానే ఆగం కావొద్దని.. ఏ మాత్రం తేడా జరిగినా జీవితాలు తలకిందులు అవుతాయని కేసీఆర్ హెచ్చరించారు. రైతుబంధు ఎలక్షన్ల కోసం పెట్టిన స్కీమ్ కాదని.. రైతుబంధు పెట్టాలని ఎవ్వరూ తనను అడగలేదని సీఎం పేర్కొన్నారు. ఏడాదికి రూ.5 వేల కోట్లు తెలంగాణకు ఇవ్వకుండా ఆపారని కేసీఆర్ వెల్లడించారు. సంస్కరణల పేరిట విద్యుత్ రంగాన్ని కూడా ప్రైవేట్‌పరం చేయాలని చూస్తున్నారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. మోటార్లకు మీటర్లు పెట్టనందుకు కేంద్రం మనకు రూ.లక్ష కోట్లు ఇవ్వలేదని ముఖ్యమంత్రి తెలిపారు. 

ధరణి పోర్టల్ వల్ల రైతులకు ఎన్నో లాభాలు వున్నాయని.. ధరణి వచ్చాక రైతుల భూములపై ఉన్న బాసులు లేకుండా పోయారని కేసీఆర్ పేర్కొన్నారు. ధరణి వల్ల భూముల రిజిస్ట్రేషన్‌లలో దళారులు లేకుండా పోయారని సీఎం తెలిపారు. ఎవరూ అడగకుండానే రైతుబంధు తీసుకొచ్చానని.. తెలంగాణలో ఇవాళ 3 కోట్ల టన్నుల వరి పండుతోందన్నారు. రాష్ట్రంలో మిగిలిన ప్రాజెక్ట్‌లు కూడా పూర్తయితే 4 కోట్ల టన్నుల ధాన్యం పండిస్తామని కేసీఆర్ చెప్పారు. యాదాద్రి పవర్ ప్లాంట్ పూర్తయితే తెలంగాణలో ఎప్పటికీ విద్యుత్ సమస్య రాదని సీఎం వెల్లడించారు. 17 రాష్ట్రాల్లో బీడీ కార్మికులు వున్నారని.. ఎక్కడైనా పింఛను ఇస్తున్నారా అని కేసీఆర్ ప్రశ్నించారు. 
 

click me!