Telangana assembly Election: రాజకీయాలలో శాశ్వత మిత్రులు.. శాశ్వత శత్రువులు ఉండరు. నేతలు తమ స్వప్రయోజనాల కోసం పూటకు పార్టీ మారుస్తూ తమ పబ్బం గడుపుకుంటారు. నేడు విమర్శించిన నేతను మరుసటి రోజు ప్రశంసించిన ఆశ్చర్యపోనవసరం లేదు. తెలంగాణ రాజకీయాల్లో కూడా అలాంటి సిత్రాలు తారపడుతున్నాయి.
Telangana assembly Election: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టయిన టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు మంగళవారం జైలు నుంచి విడుదలయ్యారు. ఆరోగ్యం దృష్ట్యా ఆయనకు హైకోర్టు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఆయన వైద్య పరీక్ష నిమిత్తం హైదరాబాద్‌కు చేరుకున్నారు. నేడు ఏఐజీ ఆస్పత్రికి వెళ్లనున్నారు.
ఇక్కడ వరకు వేరే విషయం.. చంద్రబాబు హైదరాబాదుకు రావడాన్ని బీఆర్ఎస్ పార్టీ తమకు అనుకూలంగా మలుచుకోవాలని చూస్తోంది. ఆయనను కలిసి పరామర్శించేందుకు ఎవర్ని పంపించానే అంశంపై గులాబీ పార్టీలో చర్చ సాగుతున్నట్టు తెలిసింది. పార్టీ అధ్యక్షుడు మంత్రి కేటీఆర్‌ను పంపాలా? లేక ఇతర నాయకులను పంపించాలా? అనే అంశంపై చర్చ జరుగుతున్నటు సమాచారం. ఈ సమయంలో చంద్రబాబుతో భేటీ ఎందుకు? నారాతో భేటీ వల్ల గులాబీ పార్టీకి చేరుకూరే ప్రయోజనమేంటీ ? అనే సందేహాలు రాక మానవు. ఇక్కడే అసలు మతలబ్ ఉంది.
ఆంధ్ర సెటిలర్లను ఆట్రాక్ట్ చేయడానికేనా?
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబును అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ సైబరాబాద్‌లోని ఐటీ ఉద్యోగులు ఆందోళన చేసిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో ఆందోళనకారులపై బీఆర్ఎస్ ప్రభుత్వం లాఠీ ఝూళిపించింది. నిరసన ప్రదర్శనలను తీవ్ర స్థాయిలో వ్యతిరేకించింది. సరిగ్గా అదే సమయంలో ఏపీ లీడర్ చంద్రబాబును అరెస్టు చేస్తే.. హైదరాబాద్‌లో ఆందోళనలు చేయడమేంటని విమర్శించారు. వారి నిరసన ప్రదర్శనలకు అనుమతి ఇవ్వబోమని, ఇదే విషయాన్ని చంద్రబాబు తనయుడు లోకేష్ కూడా తనకు ఫోన్ చేసి చెప్పినట్టు వెల్లడించారు. దీంతో బీఆర్ఎస్‌పై ఆంధ్ర సెటిలర్ల ఆగ్రహం పెల్లుబికింది.
ఇంతకాలం బీఆర్ఎస్ కు సపోర్టు చేసి తాము తప్పు చేశామని, ఈ ఎన్నికల్లో బీజేపీ లేదా కాంగ్రెస్ పార్టీకి తమ మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు టాక్ వచ్చింది. ఈ విషయాన్ని గ్రహించిన గులాబీ పార్టీ.. ఈ సమస్యలు ఎలాగైనా ఈ సమస్యను పరిష్కరించాలని, ఆంధ్ర ఓటర్లను శాంతింపజేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే బీఆర్ఎస్ నేతలు చంద్రబాబు ఆరోగ్యంపై ఆరా తీయడం, చంద్రబాబు అరెస్టును వ్యతిరేకించడం, అదే సమయంలో జగన్ పాలనపై పరోక్షంగా ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌కు ఆరోగ్య పరీక్ష నిమిత్తం వచ్చిన చంద్రబాబును కచ్చితంగా పరామర్శించాలని, లేకపోతే సెటిలర్ ఓటర్లలో మరింత వ్యతిరేకత పెరుగుతుందనే అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అయితే.. చంద్రబాబును కలిసే బాధ్యతను మంత్రి కేటీఆర్‌కు ఇవ్వాలా? లేదా స్థానిక ఎమ్మెల్యేలు మాగంటి గోపి, అరికపుడి గాంధీలకు ఇవ్వాలనే విషయంలో మల్లగుల్లాలు నడుస్తున్నట్టు సమాచారం. ఇలా ఆంధ్ర సెటిలర్లలో తీవ్ర వ్యతిరేకతను కూల్ చేసేందుకు కేసీఆర్ ప్లాన్ వేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.