
రాష్ట్ర రైతాంగానికి శుభవార్త చెప్పారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. రైతు రుణమాఫీ ప్రక్రియను ఆగస్ట్ 3వ తేదీ నుంచి పున: ప్రారంభించాలని ఆయన అధికారులను ఆదేశించారు. రైతాంగ సమస్యలు, రుణమాఫీపై ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్ రావు, ఆ శాఖ ప్రత్యేక ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తదితరులతో ప్రగతి భవన్‌లో బుధవారం సమీక్ష నిర్వహించారు ముఖ్యమంత్రి. అనంతరం రేపటి నుంచి రైతు రుణమాఫీని తిరిగి ప్రారంభించాలని ఆదేశించారు. నోట్ల రద్దు, కరోనా కారణంగా వచ్చిన ఆర్ధిక ఇబ్బందులు, ఎఫ్ఆర్‌బీఎం పరిమితి పెంపుపై కేంద్రం అనుసరించిన కక్షపూరిత చర్యల వల్లే రైతు రుణమాఫీ చేయడానికి సమయం పట్టిందని కేసీఆర్ అన్నారు.
అయినా ఎన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ రైతుల సంక్షేమం కోసం ఇచ్చిన మాటకు కట్టుబడే వుంటామని సీఎం పేర్కొన్నారు. అలాగే రైతు బంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్, సాగునీటి పథకాలను నిబద్ధతతో కొనసాగిస్తున్నామని కేసీఆర్ తెలిపారు. రైతులకు మరో రూ.19 వేల కోట్ల రుణమాఫీ జరగాల్సి వుందని.. రైతు బంధు తరహాలో విడతలవారీగా చేస్తూ, సెప్టెంబర్ రెండో వారం నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.