
Telangana Governor Tamilisai Soundararajan: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బుధవారం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి వరద నియంత్రణకు దీర్ఘకాలిక పరిష్కారాలను కనుగొనాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. అన్ని ప్రాంతాలను మ్యాపింగ్ చేయడం ద్వారా ముందస్తు చర్యలు తీసుకోవాలనీ, స్తబ్దతకు కారణాలు, వరదల తీవ్రతను గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలని ఆమె ప్రభుత్వానికి సూచించారు. వర్షాలను మనం నిరోధించలేము కానీ వర్షాల వల్ల మానవ నిర్మిత నష్టాన్ని నివారించవచ్చని అన్నారు. ఇదే దీనికి సరైన సమయమనీ, తెలంగాణ ప్రజలు మళ్లీ మళ్లీ ఇబ్బందులు పడొద్దనీ, తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు.
'స్థానిక అధికారులు మంచి పనులు చేస్తున్నారు. వారి సహాయం లేకుండా కొన్ని రెస్క్యూ మిషన్లు జరిగేవి కావు, కానీ ఈ సమస్యలు ఎందుకు సంభవిస్తున్నాయో వారు చూడాలి. దీర్ఘకాలిక పరిష్కారాలు ఉండాలి. సమస్యలు ఏమిటో గుర్తించి వాటిని సరిదిద్దాలి' అని గవర్నర్ పేర్కొన్నారు. భారీ వర్షానికి వంతెన కూలిన హన్మకొండలోని జవహర్ కాలనీని ఆమె సందర్శించారు. దీని గురించి మాట్లాడుతూ.. "దీని వల్ల భారీ నష్టం వాటిల్లింది. బ్రిడ్జి పునర్నిర్మాణానికి తాము చాలా కాలంగా విజ్ఞప్తి చేస్తున్నామని, ఇలా చేసి ఉంటే ఇంత ఘోరం జరిగి ఉండేది కాదని ప్రజలు నాతో అన్నారని" తెలిపారు. భారీ వర్షాలు, వరదలతో ప్రజలు తీవ్రంగా నష్టపోయారనీ, మన సోదరసోదరీమణులు ఇబ్బందులు పడటం బాధాకరమని గవర్నర్ అన్నారు.
కొద్ది రోజుల క్రితం వివిధ జిల్లాల్లోని రెడ్ క్రాస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాననీ, ఆమె విజ్ఞప్తి మేరకు వారు పనులు ప్రారంభించారని తెలిపారు. వరదల్లో చిక్కుకున్న వారిని ఆదుకున్న ఎన్జీవోలను ఆమె అభినందించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు నిత్యావసర సరుకులు, పరిశుభ్రత కిట్లు, పిల్లలకు ఆహారం, మందులు అవసరమని గవర్నర్ సౌందరరాజన్ పేర్కొన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో అంటువ్యాధుల నివారణకు చర్యలు తీసుకోవాలని ఒక వైద్యురాలిగా రాష్ట్ర ప్రభుత్వానికి తన సలహా అని ఆమె చెప్పారు. ప్రజలకు తగినంత శుద్ధి చేసిన తాగునీరు అందేలా చూడాలన్నారు. ''వరద అనంతర పరిస్థితిని పర్యవేక్షించాలి. వర్షాలు, వరదలు ఆగిపోయినంత మాత్రాన మనం రిలాక్స్ కాలేం. వరద అనంతర పరిస్థితి మరింత ప్రమాదకరం.. ఈ పరిస్థితి నుంచి ప్రజలను కాపాడాలి'' అని తమిళిసై అన్నారు.