దళిత బంధుతో బిపిలు పెరుగుతున్నాయి...: హాలియా సభలో ఈటలపై కేసీఆర్ పరోక్ష వ్యాఖ్యలు

By Arun Kumar PFirst Published Aug 2, 2021, 1:43 PM IST
Highlights

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం నల్గొండ జిల్లాలో పర్యటించారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని హాలియాలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొన్న ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. 

నల్గొండ: దళిత బంధుపై కొందరు అపోహలతో అవమానకరంగా మాట్లాడుతున్నారు... ఎప్పుడు ఇలాంటివి చేసిన ముఖాలు కావు కాబట్టే అవాకులు చెవాకులు పేలుతున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు16 నుండి 17 లక్షల దళిత కుటుంబాలు వుంటాయని... వీటిలో దళిత బంధుకు అర్హులైన కుటుంబాలు 70నుండి 80శాతం అంటే 12 లక్షల వరకు వుంటాయన్నారు. వీరందరికి వందకు వంద శాతం దళిత బంధు అందుతుందని సీఎం స్పష్టం చేశారు. 

ఇవాళ(సోమవారం) నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా హాలియాలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న ఆయన ఉప ఎన్నికల హామీపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ... ఇటీవల ప్రభుత్వ దళిత బంధు ప్రకటనతో రాజకీయ పార్టీలకు గుండె దడ మొదలయ్యిందని అన్నారు.  మరికొందరికి బిపిలు పెరుగుతున్నాయి అంటూ పరోక్షంగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు సీఎం కేసీఆర్. 

వచ్చే ఏడాది నుండి దళిత బంధు కోసం బడ్జెట్ లో భారీగా డబ్బులు కేటాయించనున్నామని కేసీఆర్ తెలిపారు. ఈ ఏడాది మాత్రం నియోజకవర్గానికి 100 కుటుంబాల చొప్పున దళిత బంధు డబ్బులు అందిస్తాన్నారు. ఈ పథకం కోసం ఎవరూ డిమాండ్ చేయలేదు... తానే సుమోటాగా దళితులు ఆర్థిక పరిస్థితి గురించి తెలుసుకుని తీసుకువచ్చానని అన్నారు. 

read more  దళిత బంధుపై పిల్: కేసీఆర్ కు ఊరట, అత్యవసరంగా విచారించలేమన్న హైకోర్టు

ఇక నాగార్జునసాగర్ నియోజకవర్గంపై సీఎం వరాలు కురిపించారు. నందికొండలో ఇంటి స్థలం వున్నవారికి పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారు.  అలాగే మున్సిపాలిటీలోని ఇళ్లను రెగ్యులరైజ్ చేస్తామన్నారు. దేవరకొండలో ఐదు లిప్ట్ లు మంజూరు చేశారు. హాలియాను అద్భుతంగా తీర్చిదిద్దుతామని... ఇండోర్ స్టేడియం నిర్మాణానికి హామీ ఇచ్చారు. ఇప్పటికే డిగ్రీ కాలేజి మంజూరు చేయడం జరిగిందని.. ఇందుకోసం నిధులు కేటాయిస్తున్నామని అన్నారు. 

కరోనా కారణంగా నల్గొండ జిల్లా పర్యటన ఆలస్యమైందన్నారు సీఎం కేసీఆర్. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా దేశాన్ని, రాష్ట్రాన్ని కూడా పీడిస్తోందన్నారు. నాగార్జున సాగర్ ఉపఎన్నికలో పాల్గొన్న తర్వాత తాను కూడా ఈ మహమ్మారి బారిన పడ్డానని సీఎం తెలిపారు. 

కృష్టా నదిపై అక్రమ నిర్మాణాలు చేపట్టడమే కాదు కొద్దిరోజులుగా మనపైనే ఏపీ వాళ్లు దాదాగిరి చేస్తున్నారని అన్నారు. కేంద్రం కూడా నదీజలాల పంపిణీ విషయంలో అన్యాయంగా వ్యవహరించిందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రానికి అందాల్సిన నీటి వాటా పొంది తీరతామని కేసీఆర్ స్పష్టం చేశారు. 
 

click me!