కేసీఆర్ మదిలో ‘‘పార్లమెంటరీ కార్యదర్శులు’’.. కోర్టు ఏమంటుందో..?

By sivanagaprasad kodatiFirst Published Jan 7, 2019, 11:31 AM IST
Highlights

తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నెల రోజులు గడుస్తున్నా ఇంతవరకు కేబినెట్‌ ఏర్పాటు చేయకపోవడంతో కేసీఆర్‌పై అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది.

తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నెల రోజులు గడుస్తున్నా ఇంతవరకు కేబినెట్‌ ఏర్పాటు చేయకపోవడంతో కేసీఆర్‌పై అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. భారీ మెజారీటీ రావడంతో పాటు ఇతర పార్టీల నుంచి వచ్చినవారిని సైతం సంతృప్తి పరచాల్సి రావడంతో కేసీఆర్‌కు కేబినెట్ రూపకల్పన కత్తిమీద సాములా మారింది. 

దీంతో పార్లమెంటరీ కార్యదర్శుల వ్యవస్థకు మళ్లీ పరుడు పోయాలని కేసీఆర్ భావిస్తున్నారు. మంత్రిమండలిలో 18 మందికి మించి స్థానం కల్పించే అవకాశం లేకపోవడంతో దీనికి ప్రత్యామ్నాయంగా కొందరు ఎమ్మెల్యేలను పార్లమెంటరీ కార్యదర్శులుగా నియమిస్తేనే బెటరనే ఆలోచనలో ముఖ్యమంత్రి ఉన్నారు.

అయితే 2015లో ఆరుగురు ఎమ్మెల్యేలను పార్లమెంటరీ కార్యదర్శులుగా నియమించడంతో అప్పట్లో ఉమ్మడి హైకోర్టు వారి నియమాకాన్ని రద్దు చేసింది. ఈ నేపథ్యంలో దీని అమలు సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయాల్సిందిగా కొందరినీ కోరినట్లుగా తెలుస్తోంది.

అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే మొత్తం 12 మందికి పార్లమెంటరీ కార్యదర్శి పదవి దక్కే ఛాన్స్ ఉంది.. ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు హోంమంత్రి మహమూద్ అలీ కేబినెట్‌లో ఉన్నారు. మరో 16 మందికి మంత్రిమండలిలో స్థానం కల్పించనున్నారు. 

12 మందిని కేబినెట్ కార్యదర్శలుగా, స్పీకర్, డిప్యూటీ స్పీకర్, ప్రభుత్వ చీఫ్ విప్, విప్ పదవులు కొందరిని వరించనున్నాయి. పదవుల పంపకంలో అన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం వుండేలా సీఎం కసరత్తు చేస్తున్నారు. అలాగే ఈసారి న్యాయపరమైన చిక్కులు రాకుండా హైకోర్టులో రివ్యూ పిటిషన్ వేసే అంశాన్ని చంద్రశేఖర్ రావు పరిశీలిస్తున్నారు. 

పార్లమెంటరీ కార్యదర్శులంటే: రాజ్యాంగంలోని అధికరణ 164 (1ఏ) ప్రకారం రాష్ట్ర శాసనసభలోని మొత్తం సభ్యుల సంఖ్యలో 15 శాతం కన్నా మంత్రులు ఉండటానికి వీల్లేదు. అందుకే దేశంలోని చాలా రాష్ట్ర ప్రభుత్వాలు పార్లమెంటరీ కార్యదర్శుల నియమాకానికి మొగ్గు చూపుతున్నాయి.

ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలు ఇప్పటికే ఈ విధానాన్ని అమలు చేశాయి. వీరికి కేబినెట్ ర్యాంక్‌తో పాటు మంత్రులకు ఉండే అన్ని రకాల భత్యాలు ఉంటాయి. అయితే మంత్రిమండలి సమావేశాల్లో అధికారికంగా పాల్గనడానికి వీల్లేదు. ఉమ్మడి రాష్ట్రంలో 1978లో మర్రిచెన్నారెడ్డి తొలిసారిగా పార్లమెంటరీ కార్యదర్శులను నియమించారు. ఆ తర్వాత కేసీఆరే ఈ విధానానికి శ్రీకారం చుట్టారు.
 

click me!