
మాజీ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి అరుదైన ఆహ్వానం అందించింది. ప్రముఖ హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి కేటీఆర్ కి ఆహ్వానం పలికింది. హార్వర్డ్ యూనివర్సిటీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న ‘హార్వర్డ్ ఇండియా’ వార్షిక సమావేశానికి హాజరు కావాల్సిందిగా ఆహ్వానం పంపింది.
ఫిబ్రవరి 16,17 తేదీల్లో అమెరికాలోని మసాచుసెట్స్‌లో జరగనున్న ఈ సమావేశంలో వివిధ దేశాలకు చెందిన ప్రముఖులు హాజరుకానున్నారు. సమకాలీన భారతదేశం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లు, వివిధ అభివృద్ధి అంశాలపైన రెండు రోజుల పాటు ఈ సమావేశంలో చర్చ జరగనుంది.
ప్రపంచ నలుమూలల నుంచి సుమారు వెయ్యి మంది విద్యావేత్తలు, ప్రతిభావంతులైన విద్యార్థులు, యువ వృత్తినిపుణులు హాజరు కానున్న ఈ సమావేశానికి కెటిఆర్‌ను ఆహ్వానిస్తూ యూనివర్సిటీ లేఖ పంపించడం విశేషం. ‘ఇండియా ఎట్ ఇన్‌ప్లేక్షన్ పాయింట్ థీమ్’ అధారంగా సాగనున్న ఈ సమావేశంలో ప్రత్యేక వక్తగా హాజరై ప్రసంగించాల్సిందిగా కెటిఆర్‌ను యూనివర్సిటీ వార్షిక సదస్సు నిర్వహక కమిటీ కోరింది.