ధరణిని తీసేస్తారంట.. వాళ్లనే బంగాళాఖాతంలో కలిపేయాలి : కాంగ్రెస్‌ నేతలపై కేసీఆర్ ఆగ్రహం

By Siva KodatiFirst Published Jun 4, 2023, 7:30 PM IST
Highlights

నిర్మల్‌లో ఆదివారం జరిగిన బహిరంగ సభలో కాంగ్రెస్ నేతలపై మండిపడ్డారు తెలంగాణ సీఎం కేసీఆర్. అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్‌ను తీసేస్తామని వాళ్లు అంటున్నారని.. వాళ్లనే బంగాళాఖాతంలో కలిపేయాలని కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ధరణి పోర్టల్ తీసి బంగాళాఖాతంలో కలుపుతామని కాంగ్రెస్ నేతలు అంటున్నారని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మల్‌లో ఆదివారం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ధరణి పోస్టర్‌ను తీసేస్తే ఇన్ని మార్పులు వుంటాయా అని ప్రశ్నించారు. ధరణి పోర్టల్‌ను బంగాళాఖాతంలో వేస్తామన్నవాళ్లనే బంగాళాఖాతంలో పడేయ్యాలని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పాలన మనం చూడలేదా అంటూ కేసీఆర్ దుయ్యబట్టారు. ధరణి పోర్టల్‌ను తీసేస్తే మళ్లీ ఎన్ని రోజులు రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరగాలని సీఎం ప్రశ్నించారు. 

కాంగ్రెస్ పాలనలో కనీసం మనకు మంచినీళ్లు కూడా ఇవ్వలేదని ఆయన పేర్కొన్నారు. ఎస్ఆర్ఎస్పీ ద్వారా లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని కేసీఆర్ తెలిపారు. ఈ నెల 8న చెరువుల పండుగలు జరుపుకుందామని సీఎం పేర్కొన్నారు. మళ్లీ కాంగ్రెస్ వస్తే కరెంట్ కోతలు, రైతు బంధుకు రాం రాం, దళితబంధుకు జై భీమేనంటూ సెటైర్లు వేశారు. మరి ఎవరికి అవకాశం ఇవ్వాలో ప్రజలే నిర్ణయించుకోవాలని కేసీఆర్ ప్రశ్నించారు. గిరిజనుల కోసం 196 గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేశామని సీఎం తెలిపారు. ఒకప్పుడు కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదన్నారు. మన హయాంలో 24 గంటలు ఉచిత కరెంట్ ఇస్తున్నామని కేసీఆర్ తెలిపారు. మహారాష్ట్ర రైతులు మన దగ్గర అర ఎకరం కొని వాళ్ల పొలాలకు నీళ్లు తీసుకెళ్తున్నారని చెప్పారు. 

Also Read: మహారాష్ట్ర వాసులు తెలంగాణ పథకాలు కావాలంటున్నారు : కేసీఆర్

నిర్మల్ జిల్లాలోని పంచాయతీలు ఒక్కొక్క దానికి రూ.10 లక్షల చొప్పున మంజూరు చేస్తున్నట్లు తెలిపారు సీఎం కేసీఆర్. ఆదివారం జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ.. నిర్మల్ జిల్లాలో 396 గ్రామ పంచాయతీలు వున్నాయన్నారు. అలాగే నిర్మల్ మున్సిపాలిటీకి రూ.25 కోట్లు మంజూరు చేస్తున్నామని కేసీఆర్ ప్రకటించారు. టెన్త్ ఫలితాల్లో రాష్ట్రంలోనే నిర్మల్ జిల్లా నెంబర్ వన్‌గా నిలిచిందన్నారు. బాసర సరస్వతీ ఆలయాన్ని అభివృద్ది చేసుకుందామన్న కేసీఆర్.. త్వరలోనే పునాదిరాయి వేస్తానని తెలిపారు. 
 

click me!