తెలంగాణలో వున్న పథకాలు చూసి మహారాష్ట్ర ప్రజలు ఆశ్చర్యపోతున్నారని అన్నారు సీఎం కేసీఆర్. రాబోయే రోజుల్లో దేశానికే తలమానికంగా నిలిచేలా ముందుకు సాగుదామన్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగుందని.. తాగు, నీటి సమస్యను అధిగమించామని సీఎం అన్నారు.
సమిష్టి కృషితోనే అద్భుత పురోగతి సాధించామన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. నిర్మల్ జిల్లాలో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్‌ను సీఎం ఆదివారం ప్రారంభించారు. శిలాఫలకాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై చాంబర్‌లో కలెక్టర్ వరుణ్ రెడ్డిని కూర్చోబెట్టి అభినందనలు తెలియజేశారు. అనంతరం ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు నాలుగు మెడికల్ కాలేజీలు మంజూరు చేశామని ఆయన తెలిపారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగుందని.. తాగు, నీటి సమస్యను అధిగమించామని సీఎం అన్నారు.
రాబోయే రోజుల్లో దేశానికే తలమానికంగా నిలిచేలా ముందుకు సాగుదామన్నారు. ఈ నెల 24 నుంచి పోడు భూముల పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నామని.. అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని కేసీఆర్ ఆదేశించారు. తెలంగాణలో వున్న పథకాలు చూసి మహారాష్ట్ర ప్రజలు ఆశ్చర్యపోతున్నారని.. తమకు కూడా ఈ పథకాలు అమలు చేయాలని వారు కోరుతున్నారని ఆయన పేర్కొన్నారు. అంతకుముందు కలెక్టరేట్ ఆవరణలో పోలీసు బలగాలు ముఖ్యమంత్రికి గౌరవ వందనం సమర్పించారు. నిర్మల్ రూరల్ మండలంలోని ఎల్లపెల్లి గ్రామ శివారులో రూ.56 కోట్లతో ప్రభుత్వం కలెక్టరేట్ భవనాన్ని నిర్మించింది.