ప్రజల కోసం పనిచేసే వారికీ ఇబ్బందులు.. మనమంతా ఏకమవ్వాలి : రైతు సంఘాల నేతలతో కేసీఆర్

By Siva KodatiFirst Published Aug 27, 2022, 6:02 PM IST
Highlights

కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ సీఎం కేసీఆర్. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా ఇంకా కేంద్ర ప్రభుత్వ పాలన గాడిలో పడలేదని మండిపడ్డారు. ప్రజల కోసం పనిచేస్తున్న వారిని పాలకులే ఇబ్బంది పెడుతున్నారని.. వ్యవసాయరంగ సంక్షేమం దిశగా పాలన కొనసాగాల్సి వుందన్నారు. 

కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ సీఎం కేసీఆర్. శనివారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రితో దేశంలోని పలు రైతు సంఘాల ప్రతినిధులు కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా ఇంకా కేంద్ర ప్రభుత్వ పాలన గాడిలో పడలేదని మండిపడ్డారు. ప్రజల ఆకాంక్షలు నెరవేరకుండా పోవడానికి గల కారణాలను అన్వేషించాల్సి వుందని సీఎం సూచించారు. 

ప్రజల కోసం పనిచేస్తున్న వారిని పాలకులే ఇబ్బంది పెడుతున్నారని.. వ్యవసాయరంగ సంక్షేమం దిశగా పాలన కొనసాగాల్సి వుందన్నారు. దేశంలోని అనేక వర్గాలు తమ ఆకాంక్షలు, హక్కులను నెరవేర్చుకునేందుకు ఇంకా పోరాటాకు ఎందుకు సిద్ధపడుతున్నారో ఆలోచించాల్సిన అవసరం వుందన్నారు. చట్ట సభల్లో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాల్సిన వాళ్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటం దురదృష్టకరమని కేసీఆర్ అన్నారు. ఈ పరిస్ధితుల్లో దేశాన్ని కాపాడేందుకు ప్రజా సంక్షేమం కోరుకునే శక్తులు ఏకం కావాల్సి వుందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. 

ఇకపోతే.. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోన్న వ్యవసాయ విధానాలను స్వయంగా చూసేందుకు దేశంలోని 25 రాష్ట్రాలకు చెందిన రైతు ప్రతినిధులు హైదరాబాద్‌కు వచ్చారు. మూడు రోజుల పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఈ బృందం పర్యటించనుంది. శుక్రవారం సిద్ధిపేట జిల్లాలో క్షేత్రస్థాయి పరిశీలనను వారు ప్రారంభించారు. 
 

click me!