
మంత్రి ఈటల రాజేందర్ భూకబ్జాపై స్పందించారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. జిల్లా కలెక్టర్‌తో సమగ్ర దర్యాప్తు జరిపించాలని సీఎస్ సోమేశ్ కుమార్‌ను ఆదేశించారు. అలాగే నిజానిజాలు నిగ్గుతేల్చాల్సిందిగా విజిలెన్స్ డీజీని సీఎం ఆదేశించారు.
సత్వరమే ప్రాథమిక నివేదిక అందజేయాలని కేసీఆర్ అధికారులను కోరారు. ప్రస్తుతం జమునా హాచరీస్ పక్కనే వున్న 25 ఎకరాల భూమిని ఇవ్వాలని మంత్రి ఈటల పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
వ్యవస్థల్ని ప్రభావితం చేస్తూ తమకు రెగ్యులరైజ్ చేయాలని ఒత్తిడి తీసుకొచ్చినట్లు అడిషనల్ కలెక్టర్లు, మాజీ కలెక్టర్లు మీడియాకు తెలిపారు. రెండు గ్రామాల్లో పెద్ద ఎత్తున వంద ఎకరాల్లో భూకబ్జాకు పాల్పడ్డారు మంత్రి ఈటల.
బీసీ మంత్రి అయ్యుండి వారి సంక్షేమానికి పాటుపడాల్సింది పోయి అసైన్డ్ భూములు, ప్రభుత్వం పేదలకు ఇచ్చిన భూములను పెద్ద ఎత్తున కబ్జా చేసినట్లు ఈటలపై ఆరోపణలు వస్తున్నాయి. రెండు గ్రామాల పరిధిలో ఎన్ని ఎకరాల భూములు కబ్జాలకు పాల్పడ్డారు..? ఎంతకు పాల్పడ్డారు..? బాధితులను బెదిరించారా..? ఏం చేశారన్న నిజాలు నిగ్గు తేల్చాలంటూ కేసీఆర్ ఆదేశించారు.
అంతకుముందు తమ భూములను మంత్రి ఈటెల రాజేందర్ మీద, ఆయన అనుచరుల మీద ఆరోపణలు చేస్తూ బాధిత రైతులు కేసీఆర్ కు లేఖ రాశారు. ఈటెల రాజేందర్ మీదనే ప్రధానంగా ఆరోపణలు వస్తున్నాయి. రెండు టీవీ చానెళ్లలో ఇందుకు సంబంధించి విస్తృతమైన వార్తాకథనాలు ప్రసారమవుతున్నాయి.
Also Read:మంత్రి ఈటెలపై సంచలన ఆరోపణలు, ఫిర్యాదు: వంద ఎకరాల భూకబ్జా
ప్రముఖ తెలుగు టీవీ చానెల్ 10టీవీ భూముల ఆక్రమణ సమయంలో మెదక్ జిల్లా జాయింట్ కలెక్టర్ గా పనిచేసిన నగేష్ తో మాట్లాడింది. అందుకు సంబంధించి నగేష్ తన అభిప్రాయాలను వెల్లడించారు. తమ హేచరీస్ పక్కన ఉన్న అసైన్డ్ భూములను రెగ్యులరైజ్ చేయాలని మంత్రి ఈటెల రాజేందర్ చెప్పారని, వాటిని రెగ్యులరైజ్ చేస్తే తమకు మేలు జరుగుతుందని చెప్పారని నగేష్ చెప్పారు.
తాము ఫీల్డ్ సర్వే చేసి వాటిని రెగ్యులరైజ్ చేయడం కుదరదని చెప్పినట్లు ఆయన తెలిపారు. ఈటెలతో పాటు ఆయన అనుచరులపై తమపై ఒత్తిడి తెచ్చారని ఆయన అన్నారు 20 ఎకరాల వరకు అసైన్డ్ భూములు తీసుకున్నారని ఆయన చెప్పారు. భూములు ప్రస్తుతం రైతుల ఆధీనంలో లేవని ఆయన చెప్పారు. వాటిని తిరిగి తీసుకుని సంబంధిత అధికారులు అసైనీలకు తిరిగి అప్పగించాలని ఆయన అన్నారు.
అసైన్డ్ భూములు తీసుకున్నందుకు క్రిమినల్ కేసులు కూడా పెట్టవచ్చునని ఆయన చెప్పారు. అయితే రైతులు డబ్బులు తీసుకుని అప్పగించిన సందర్భాలు కూడా ఉన్నాయని ఆయన చెప్పారు. అయితే, భూములు ఇప్పటికీ రైతుల పేర్ల మీదనే ఉన్నాయని, కొన్నవాళ్ల పేర్ల మీదికి మారలేదని ఆయన చెప్పారు.
తాము చట్టం గురించి స్పష్టంగా చెప్పామని ఆయన అన్నారు. అవసరమైతే పోలీసుల సాయం తీసుకుని తాహిసిల్దార్ తిరిగి ఆ భూములను స్వాధీనం చేసుకుని అసైనీలకు అప్పగించాలని ఆయన అన్నారు చుట్టుపక్కల భూములకు వెళ్లడానికి వీలు లేకుండా దారులు మూసేశారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి.