పోడు రైతులపై కేసులు ఎత్తివేస్తాం: గిరిజనులకు పోడు పట్టాలిచ్చిన కేసీఆర్

By narsimha lode  |  First Published Jun 30, 2023, 3:36 PM IST

పోడు రైతులకు  పట్టాలను తెలంగాణ సీఎం కేసీఆర్  ఇవాళ  పంపిణీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా  పోడు రైతులకు  రెండు  మూడు రోజుల్లో పట్టాల  పంపిణీ  పూర్తి కానుంది. 


ఆసిఫాబాద్: పోడు రైతులపై  గతంలో నమోదైన కేసులు ఎత్తివేస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు.  శుక్రవారంనాడు కొమరంభీమ్ ఆసిఫాబాద్ నూతన కలెక్టరేట్ కార్యాలయంలో  పోడు రైతులకు  సీఎం కేసీఆర్  పోడు పట్టాలను  అందించారు.  ఈ సందర్భంగా  కేసీఆర్ ప్రసంగించారు.  పోడువ్యవసాయం చేసుకుంటున్న రైతులకు   పట్టాలు  ఇచ్చిన తర్వాత  కూడ  కేసులు కొనసాగించడం సరైంది కాదన్నారు.

Latest Videos

 పోడు భూముల విషయమై  గతంలో  నమోదైన కేసులను  ఎత్తివేస్తామని  కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు  చర్యలు తీసుకోవాలని  సీఎం కేసీఆర్ తెలంగాణ డీజీపీ అంజనీకుమార్ ను  ఆదేశించారు.   మహిళల పేరుతోనే పోడు పట్టాల పంపిణీ జరుగుతుందని  కేసీఆర్  చెప్పారు. పోడు పట్టాలను  పంపిణీ చేయడం తనకు  చాలా సంతోషంగా ఉందని కేసీఆర్ తెలిపారు.  రాష్ట్రంలోని లక్షన్నర మందికి  4.06 లక్షల ఎకరాల పోడు భూమిని  పంపిణీ చేయనున్నట్టుగా  కేసీఆర్ వివరించారు.  పోడు రైతులకు  రైతు బంధు కోసం  రూ. 24 కోట్లను కూడ  మంజూరు చేసిన విషయాన్ని కేసీఆర్ గుర్తు  చేశారు. 

also read:కొమరంభీమ్ ఆసిఫాబాద్: కొత్త కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలు ప్రారంభించిన కేసీఆర్

తమ ప్రభుత్వ పాలనలో తెలంగాణ దేశంలోనే  నెంబర్ వన్ గా నిలిచిందని  కేసీఆర్  చెప్పారు.  ఆసిఫాబాద్  జిల్లాలో  మెడికల్ కాలేజీని  కూడ  నిర్మిస్తున్న విషయాన్ని కేసీఆర్ గుర్తు  చేశారు. అన్ని జిల్లాల్లోని  మారుమూల  గ్రామాల రైతులకు వ్యవసాయానికి  త్రీఫేజ్  విద్యుత్ ను అందిస్తున్న విషయాన్ని కేసీఆర్  ప్రస్తావించారు. 
 

click me!