దేశంలో భావ స్వేచ్ఛ లేదు: పెగాసస్ వ్యవహారంపై విక్రమార్క స్పందన

By Siva KodatiFirst Published Jul 20, 2021, 2:31 PM IST
Highlights

పెగాసస్ స్పైవేర్‌ను ప్రభుత్వాలకు మాత్రమే అమ్ముతారని అన్నారు తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. దేశంలో భావ స్వేచ్ఛ లేకుండా పోయిందని భట్టి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా విపక్షనేతల ఫోన్లు ట్యాప్ చేస్తోందని విక్రమార్క ఆరోపించారు. 
 

పెగాసస్‌ వ్యవహారం దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. దేశంలోని కేంద్రమంత్రులు, బడా వ్యాపారవేత్తలు, ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతలు, ఇతర ప్రముఖుల సెల్‌ఫోన్‌లో స్పైవేర్‌ను చొప్పించి నిఘా పెడుతున్నారంటూ నిన్న వచ్చిన కథనాలు యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేశాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. పెగాసెస్‌ స్పైవేర్‌తో నిఘా పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read:పెగాసెస్‌పై విపక్షాల ఆందోళన: ప్రారంభమైన కొద్దిసేపటికే పార్లమెంట్ ఉభయ సభల వాయిదా

ప్రధాని నరేంద్రమోడీ, హోంమంత్రి అమిత్ షా దేశానికి సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో విపక్షనేతలపై నిఘా సరికాదని భట్టి మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా విపక్షనేతల ఫోన్లు ట్యాప్ చేస్తోందని విక్రమార్క ఆరోపించారు. రాహుల్ గాంధీ ఫోన్‌పై నిఘా పెట్టడాన్ని నిరసిస్తూ 22న ఇందిరాపార్క్ నుంచి చలో రాజ్‌భవన్ కార్యక్రమానికి ఆయన పిలుపునిచ్చారు. రాజ్యంగం కల్పించిన హక్కులకు భంగం కలుగుతోందని భట్టి మండిపడ్డారు. పెగాసస్ స్పైవేర్‌ను ప్రభుత్వాలకు మాత్రమే అమ్ముతారని విక్రమార్క తెలిపారు. దేశంలో భావ స్వేచ్ఛ లేకుండా పోయిందని భట్టి వెల్లడించారు. 

click me!