పెండింగ్ ధరఖాస్తులు వెంటనే పరిష్కరించాలి: ధరణిపై రేవంత్ రివ్యూ

By narsimha lode  |  First Published Feb 24, 2024, 7:14 PM IST


ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ధరణి సమస్యల పరిష్కారం కోసం  రేవంత్ సర్కార్  కార్యాచరణను ప్రారంభించింది.


హైదరాబాద్:  ధరణిలో పెండింగ్​లో  ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి ఆదేశించారు. మార్చి మొదటి వారంలోనే అన్ని మండల తహసీల్దార్ ఆఫీసుల్లో వీటిని పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సీఎం సూచించారు. శనివారం సచివాలయంలో ధరణి కమిటీతో ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.

also read:టీడీపీ-జనసేన అభ్యర్థుల జాబితా విడుదల: 94 స్థానాల్లో టీడీపీ, 5 స్థానాల్లో అభ్యర్థుల ప్రకటన

Latest Videos

undefined

ధరణి కమిటీ చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి అవసరమైన విధి విధానాలను రూపొందించాలని రెవిన్యూ శాఖను ఆదేశించారు. 2020లో అమల్లోకి వచ్చిన ఆర్వో ఆర్ చట్టంలోనే లోపాలున్నాయని ధరణి కమిటీ ముఖ్యమంత్రికి నివేదించింది.లక్షలాది దరఖాస్తులు ఇప్పటికే తిరస్కరణకు గురయ్యాయని, ఒక్కో తప్పును సవరించుకోవాలంటే వెయ్యి రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉండటం రైతులకు భారంగా మారిందని కమిటీ సీఎం దృష్టికి తెచ్చింది. 

also read:తొలి జాబితా: టీడీపీ సీనియర్లకు దక్కని చోటు, ఎందుకంటే?

 అటు రిజిస్ట్రేషన్ల శాఖ, ఇటు రెవిన్యూ శాఖల మధ్య సమన్వయం లోపంతో నిషేధిత జాబితాలో ఉన్న భూముల క్రయ విక్రయాలు కూడా జరుగుతున్న విషయాన్ని కమిటీ సభ్యులు  ప్రస్తావించారు.   ధరణి డేటాను వ్యవసాయ శాఖ ప్రామాణికంగా తీసుకొని రైతు బంధు ఖాతాలో జమ చేయటంతో ఇప్పటికే కోట్లాది రూపాయల ప్రభుత్వ ధనం దుర్వినియోగమైందని చర్చ జరిగింది.

 ఇప్పుడున్న ధరణి లోపాలను సవరించాలంటే చట్ట సవరణ చేయటం లేదా కొత్త ఆర్ వో ఆర్ చట్టం చేయటం తప్ప గత్యంతరం లేదని కమిటీ సభ్యులు ముఖ్యమంత్రికి నివేదించారు. కమిటీ ఇచ్చే తుది నివేదిక ఆధారంగా శాశ్వత పరిష్కారానికి నిర్ణయం తీసుకుందామని సీఎం చెప్పారు. సమస్యలను మరింత లోతుగా అధ్యయనం చేయాలని, ఎలాంటి భూవివాదాలు, కొత్త చిక్కులు లేకుండా భూముల రికార్డుల ప్రక్షాళన చేపట్టాల్సిన అవసరముందని సీఎం అన్నారు. 

భూముల రికార్డులపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలతో ఇప్పుడున్న లోపాలకు చెక్ పెట్టడంతో పాటు  కొత్త సమస్యలు రాకుండా ఉండాలని సీఎం కమిటీ సభ్యులను అప్రమత్తం చేశారు. కమిటీ ఇచ్చే  తుది నివేదిక ఆధారంగా శాశ్వత పరిష్కారానికి నిర్ణయం తీసుకుందామని చెప్పారు. అప్పటివరకు తక్షణం పరిష్కరించాల్సిన సమస్యలపై దృష్టి పెట్టాలని  సీఎం సూచించారు.

also read:కూటమి బలంగా ఉండాలనే తక్కువ సీట్లలో పోటీ: పవన్ కళ్యాణ్

రాష్ట్రవ్యాప్తంగా ధరణిలో 2.45 లక్షల పెండింగ్ కేసులున్నాయని సీఎం చెప్పారు. మొదటి విడతగా వీటిని వెంటనే పరిష్కరించేందుకు ఏమేం మార్గాలున్నాయని ముఖ్యమంత్రి అధికారులతో చర్చించారు. రైతులను ఇబ్బంది పెట్టకుండా వెంటనే వీటిని పరిష్కరించేందుకు అవసరమైన ఉత్తర్వులు జారీ చేయాలని, మార్చి మొదటి వారంలోనే అందుకు  ఏర్పాట్లు చేయాలని  సీఎం అధికారులకు సూచించారు. 

ఈ సమావేశంలో రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ధరణి కమిటీ సభ్యులు ఎం. కోదండరెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ రేమండ్ పీటర్, అడ్వకేట్ సునీల్, రిటైర్డ్ స్పెషల్ గ్రేడ్ కలెక్టర్ బి.మధుసూదన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, రెవిన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి శేషాద్రి, సీసీఎల్ఏ అధికారి లచ్చిరెడ్డి తదితరులున్నారు.
 

click me!